సాధారణంగా ఏదన్నా రాజకీయ పార్టీ బహిరంగ సభ జరిగితే, అక్కడ రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించి ఫొటోలు ఏమీ వుండవ్. కానీ, వైసీపీ తాజాగా నిర్వహించిన ‘సిద్ధం’ బహిరంగ సభలో, టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోలూ దర్శనమిచ్చాయ్.
అయితే, టీడీపీ అధినేత అలాగే జనసేన అధినేత బొమ్మల్ని కార్టూన్ల తరహాలో.. అంటే, దుష్ట చతుష్టయం.. అన్నట్టుగా వేర్వేరుగా పెట్టారు. వాటిల్లో పవన్ కళ్యాణ్ బొమ్మ దగ్గర వున్న బాక్సింగ్ బ్యాగ్‌ని వైసీపీ మద్దతుదారులు కొందరు గట్టిగానే వాడారు.
వాడటం అంటే, బాక్సింగ్ చేశారన్నమాట. తద్వారా పవన్ కళ్యాణ్‌ని భౌతికంగా అంతమొందిస్తామన్న సంకేతాల్ని వైసీపీ ఇస్తోందని అనుకోవాలా.? అన్న చర్చకు తెరలేచింది పరిస్థితి. అసలు ఇదేం పద్ధతి.? ఎవరిచ్చారు ఈ ‘సలహా’.!
ఇలాంటి సలహాలు ఇవ్వడానికేనా, ప్రభుత్వం ప్రజాధనాన్ని సలహాదారుల కోసం వెచ్చిస్తున్నది.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. ఇదంతా వైరల్ యుగం.! పవన్ కళ్యాణ్‌ని బాక్సింగ్ చేస్తున్నట్లుగా వైసీపీ సృష్టించిన ఈ కాన్సెప్ట్, ముందు ముందు ఇతర పార్టీలూ చాలా తేలిగ్గా వాడేస్తాయ్. జనసేన, టీడీపీ నిర్వహించే బహిరంగ సభల్లో జగన్ దిష్టిబొమ్మని బాక్సింగ్ ఆడుకుంటే ఎలా వుంటుంది.?
వినడానికి చాలా ఛండాలంగా వుంటాయ్ ఇలాంటి కాన్సెప్టులు. ‘ఇలాంటివి తప్పు బ్రో..’ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లే తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తుండడం గమనార్హం.
ముమ్మాటికీ ఇది పైత్యమే.! వైఎస్ జగన్ ఇలాంటివి ప్రోత్సహించకుండా వుండాల్సింది. ముఖ్యమంత్రి హోదాలో వున్నారాయన.! రేప్పొద్దున్న టీడీపీ, జనసేన చేసినా.. ఇలాంటివాటిని ఎవరూ సమర్థించకూడదు.