జయరాం హత్య కేసులో శిఖా చౌదరిని విచారించిన పోలీసులు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్ జయరాం రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జయరాంను రాకేష్ రెడ్డి చంపారని ముందుగా భావించారు. అయితే రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో పలు రకాలుగా సమాధానం చెబుతుండడంతో కేసు విచారణ ఆలస్యం అవుతుంది. ఓ సారి తాను ఒక్కడినే చంపానని, మరోసారి ముగ్గురితో కలిసి చంపానని అంటూ ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.

అయితే జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని ఏపీ పోలీసులు తేల్చారు. దీని పై అనుమానాలు వ్యక్తం చేసిన జయరాం భార్య శిఖా చౌదరి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయరాం భార్య ఫిర్యాదుతో శిఖా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణకు హాజరైన శిఖా చౌదరి ఏ మాత్రం భయపడకుండా ఉంది. కొంచెం కూడా బెరుకు లేకుండా పోలీసుల విచారణకు హాజరైంది. నవ్వుతూ, దైర్యంగా శిఖా చౌదరి ఉంది. 

శిఖా చౌదరి, రాకేష్ రెడ్డిలను పక్కపక్కన కూర్చోబెట్టి పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. అసలు ఎవరి ప్రమేయం ఉంది, ఎలా పరిచయం, ఎవరెవరు చంపారు వంటి ప్రశ్నలను పోలీసులు వారికి వేశారు. అయితే కొన్ని ప్రశ్నల విషయంలో వీరిద్దరు కూడా డిఫరెంట్ గా సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు విచారించారు. పోలీసుల విచారణ అనంతరం బయటికి వచ్చిన శిఖా మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ జర్నలిస్టులు అడగడంతో రెండు నిమిషాలు మాట్లాడింది. శిఖా చౌదరి ఏమని మాట్లాడిందంటే…

“కేసు పోలీసుల విచారణలో ఉంది. ఈ సమయంలో నేను ఏం మాట్లాడలేను. హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పోలీసుల విచారణలో అన్ని మీకు తెలుస్తాయి. మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పారు. తప్పకుండా వస్తాను. వారు ఎప్పుడు పిలిచినా వచ్చి కేసు విచారణకు సహకరిస్తాను. త్వరలోనే అన్ని విషయాలతొ మీడియా ముందుకు వస్తాను.” అని శిఖా చౌదరి అన్నారు. ఈ కేసు విచారణలో రోజుకో ట్వీస్ట్ బయటికొస్తుంది. దీంతో మరోసారి ఈ కేసు సంచలనంగా మారుతుంది.