హైదరాబాద్ లో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల అరెస్ట్ హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. పట్టుబడిన నలుగురు మావోయిస్టులలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఏఓబీ ప్రాంతం నుంచి పారిపోయి హైదరాబాద్ కు నలుగురు మావోలు చేరుకున్నారన్న సమాచారంతో, విశాఖ పోలీసులు సోమవారం రాత్రి మౌలాలీ ప్రాంతంలో దాడులు చేశారు. ఆపై ముగ్గురు మహిళా మావోలు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు పట్టుబడిన వారిలో ఆత్మకూరు అనూష, ఆత్మకూరు అన్నపూర్ణ, భవాని, కొర్ర కామేశ్వరరావు ఉన్నారు. వీరిని బుధవారం కోర్టు ముందు హాజరు పరిచి విశాఖకు తరలిస్తామని ఓ అధికారి తెలిపారు. వీరంతా 2017 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, గత సంవత్సరం వీరు అగ్రనేత రామకృష్ణతో కలిసి పని చేశారని పోలీసులు తెలిపారు. మన్యం ప్రాంతంలో మావోయిస్టుల సంఖ్యను పెంచుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని, యువతను మావోయిస్టుల వైపు మళ్లించారని చెప్పారు. అరెస్టయిన వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారని అన్నారు.
పోలీసులపై మావోలు దాడి చేసిన మూడు ఘటనల్లో వీరు ప్రత్యక్షంగా పాలు పంచుకున్నారని వెల్లడించారు. అయితే వీరిని డిసెంబర్ 22 వ తేదినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మీడియాకు మాత్రం సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారని చెప్పారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులకు ప్రాణాపాయం ఉందని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. వారికి ఏమైనా ప్రభుత్వాలదే బాధ్యతని వారన్నారు. మరో వైపు తమ పిల్లలను పోలీసులు తీసుకెళ్లారని వారి ఆచూకి తెలపడం లేదని భవాని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.
ఇదిలా ఉంటే సోమవారం ఛత్తీస్ ఘడ్ లో ఎన్జీఆర్ ఐ ఉద్యోగి నక్కా వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఐదుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడంతో పోలీసు వర్గాలు అలర్ట్ అయ్యాయి.