మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి మ్యాప్ ప్రజంటేషన్ ద్వారా కీలక విషయాలను అంబటి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చంద్రబాబు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చిన ఘనుడు అని అంబటి తెలిపారు.
పోలవరం పనులలో నాణ్యత పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకత పాటించామని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ట్రాన్స్ ట్రాయ్ ను తీసేసి నవయుగను తెచ్చారని కాపర్ డ్యామ్ కట్టకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మించారని ఆయన కామెంట్లు చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన చెప్పుకొచ్చారు.
కాసుల కొరకు కక్కుర్తి పడి చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని ఆయన కామెంట్లు చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ను టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకోలేదని ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాపై విషప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్‌అండ్‌ఆర్ కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముంపు ప్రజలకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఖాళీ చేయించామని అంబటి వెల్లడించారు.
పోలవరం విషయంలో టీడీపీ కుట్ర చేస్తోందని జగన్ వల్లే పోలవరం ఆగినట్టు టీడీపీ మాట్లాడుతోందని అంబటి అన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి 12.6 శాతం ఆదా అయిందని అంబటి చెప్పుకొచ్చారు. కాపర్ డ్యాం కట్టిన తర్వాత డయాఫ్రం వాల్ కట్టాలని అలా చేయకపోవడం వల్లే ఇబ్బందులు అని వాస్తవాలు చెప్పే దమ్ము ఆ మీడియాకు ఉందా అని అంబటి రాంబాబు కామెంట్లు చేశారు.