తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారైంది. గతంలో అనేక మంది నేతల పేర్లు చర్చకు వచ్చినా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఫైనల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ ఎన్నికలో పోటి చేయమని ప్రకటించింది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్పీకర్ ఎన్నిక పై ఇప్పటికే అన్ని పార్టీలతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని ఆయన కోరారు. స్పీకర్ గా గురువారం అసెంబ్లీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ ఎన్నికకు కాంగ్రెస్, ఎంఐఎం, బిజెపిలు మద్దతివ్వనున్నాయి. పోటిలో ఎవరూ లేకపోవడంతో తెలంగాణ స్పీకర్ గా పోచారం ఎన్నిక ఏకగ్రీవం  కానుంది. 

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు తొలి మంత్రిగా పని చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం హయాంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, గనుల శాఖ మంత్రిగా పని చేశారు. ముందుగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన పోచారం 1984 లో టిడిపిలో చేరారు. టిడిపిలో 27 ఏళ్ల పాటు ఆయన కొనసాగారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో టిడిపి తీరు నచ్చక  టిఆర్ఎస్ లో చేరారు. 1949 ఫిబ్రవరి 10న జన్మించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. ముందుగా స్పీకర్ పదవి చేపట్టడానికి పోచారి నిరాకరించినట్టు తెలుస్తోంది. కానీ సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకు హమీనివ్వడంతో పోచారం స్పీకర్ పదవి చేపట్టడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.  

గత కొన్ని రోజులుగా స్పీకర్ ఎంపికపై జరుగుతున్న ఉత్కంఠకు తెర పడింది. ఈటల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లతో పాటుగా పలువురు నేతల పేర్లు స్పీకర్ ఎన్నికకు తెరపైకి వచ్చాయి. కానీ ఎవరూ కూడా స్పీకర్ పదవి తీసుకోవడానికి ముందుకు రాలేదన్న చర్చ జరిగింది. ఎందుకంటే గతంలో స్పీకర్ గా పని చేసిన వారెవ్వరూ కూడా మరెో సారి ఎన్నికల్లో గెలవలేకపోయారు. దీంతో స్పీకర్ పదవి చేపడితే తమ రాజకీయ జీవితం కూడా ముగుస్తుందన్న భయంతో వారు పదవి చేపట్టలేదని తెలుస్తోంది.

అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నేత కావడం, తెలుగుదేశం మరియు టిఆర్ఎస్ ప్రభుత్వాలలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండడంతో పోచారంను స్పీకర్ గా సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. దీనికి నేతలంతా మద్దతు పలకడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. దీంతో స్పీకర్ ఎంపిక పై ఉన్న ఉత్కంఠకు తెరపడింది.