మళ్లీ మొదటికి… గ్లాసు గుర్తుపై మరో పార్టీ న్యాయ పోరాటం!

వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు.. అందులో ఎన్నింటిలో గెలుస్తారు.. పవన్ ఈ సారైనా అసెంబ్లీ గేటు తాకుతారా.. టీడీపీతో వారి కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… జనసేనకు మరోసారి గాజు గ్లాసు సింబల్ వ్యవహారం మొదటికి వచ్చినట్లు తెలుస్తుంది. జ‌న‌సేన‌కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించ‌డాన్ని స‌వాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు పెద్ద తలపోటులా తయారవుతుంది గాజు గ్లాసు కేటాయింపు సమస్య అని అంటున్నారు జనసైనికులు! ఎన్నికల నాటికైనా ఈ గుర్తు జనసేనకు కేటాయించబడుతుందా.. లేక, ఫ్రీ సింబల్ గానే ఉంటుందా.. అదే జరిగితే జనసేన పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసలు ఈ సమస్య మళ్లీ తెరపైకి ఎలా వచ్చింది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం…!

ప‌దేళ్ల క్రితం జ‌నసేన పార్టీని అట్టహాసంగా ప్రారంభించిన ప‌వ‌న్‌ క‌ల్యాణ్… 2014 ఎన్నికల్లో మాత్రం పోటీచేయకుండా దూరంగా ఉన్నారు. టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. ప్రజల తరుపున తాను ప్రశ్నిస్తానని అన్నారు. అనంతరం టీడీపీ, బీజేపీల‌తో విభేదాలు రావడం వల్లో… లేక, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసమో కానీ 2019లో వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగారు.

ఈ సమయంలో… ఎన్నిక‌ల సంఘం జ‌న‌సేన‌కు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. దీంతో ఆ గుర్తును జనసేన నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో జ‌న‌సేన పార్టీకి కేవ‌లం ఒకే ఒక్క స్థానం రాగా.. రెండు చోట్ల పోటీచేసిన పవన్ ఒక్కచోట కూడా గెలవలేకపోయారు. దీంతో… నిబంధ‌న‌ల మేర‌కు ఓట్లు రాకపోవడంతో… గాజు గ్లాస్‌ ను ఫ్రీ సింబ‌ల్‌ గా గ‌త ఏడాది మే లో ఈసీ ప్రక‌టించింది.

దీంతో ఆ గుర్తు త‌మ‌కు కేటాయించాల‌ని ఎలక్షన్ కమిషన్ తో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చ‌ర్చలు సాగించింది. అయితే… ఇటీవ‌ల జ‌న‌సేన‌కు గాజు గ్లాస్ కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో… ఈ విషయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. ఫ్రీ సింబ‌ల్ అయిన గాజు గ్లాస్ గుర్తును త‌మ‌కు కేటాయించాల‌ని సంప్రదింపులు జ‌రుపుతుండ‌గా, జ‌న‌సేన‌కు ఎలా కేటాయిస్తారంటూ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

గాజు గ్లాస్‌ ను జ‌న‌సేన‌కు కేటాయించ‌డం రాజ్యాంగ విరుద్ధమ‌ని ఆ పిటిష‌న్‌ లో పేర్కొన్నారు. ఆ గుర్తును తమకే కేటాయించాలని చెబుతున్నారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల సంఘాలతోపాటు జ‌న‌సేన పార్టీని చేర్చారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచార‌ణ చేప‌ట్టేందుకు హైకోర్టు అంగీక‌రించింది. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకు ఉంటుందా.. ఊడుతుందా అనేది ఆసక్తిగా మారింది!