చంద్రబాబునాయుడు అండ్ కో అవినీతిపై హై కోర్టులో వేసిన కేసును పిటీషనరే విత్ డ్రా చేసుకున్నారు. అవినీతిపై దాఖలు చేసిన కేసులో అందుకు తగ్గట్లుగా ఆధారాలను మాత్రం పిటీషనర్ చూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. అందుకే తగిన ఆధారాలతో మరోసారి పిటీషన్ వేయాలని, ఆధారాల సేకరణలో పిటీషనర్ తీసుకున్న చర్యలను కూడా తన పిటీషన్ లో చెప్పాలంటూ కోర్టు పిటీషనర్ ను ఆదేశించింది. దాంతో చంద్రబాబు అవినీతిపై వేసిన కేసు ఎటువంటి పురోగతి లేకుండానే వాయిదాపడినట్లైంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబు, కొడుకు నారా లోకేష్, మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, ఏపిఎన్నార్జీ సీఈవో వేమూరి రవికుమార్ రూ. 25వేల కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారంటూ పిటీషనర్ ఆరోపించారు. ఏపిలో పరిశ్రమలకు భూముల కేటాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు తన పిటీషన్లో పేర్కొన్నారు. ముడుపులు తీసుకుని షెల్ కంపెనీలకు భూములు కేటాయించటం వల్లే ఒక్క కంపెనీ కూడా కార్యకలాపాలు ప్రారంభించలేదని పిటీషనర్ ఆరోపించారు.
పిటీషనర్ వేసిన కేసును విచారణ సందర్భంగా ఈరోజు పరిశీలించిన హై కోర్టు ఆరోపణలకు తగ్గ ఆధారాలను చూపమని కోరింది. అందుకు ఆధారాలను పిటీషనర్ చూపలేకపోయారు. దాంతో పిటీషన్ ను డిస్మిస్ చేయకపోయినా కేసు విచారణకైతే కోర్టు అనుమతించలేదు. ఆరోపణలకు తగ్గ ఆధారాలుంటేనే విచారణ సాధ్యామని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి సరైన ఆధారాలతో మరోసారి పిటీషన్ వేయాలంటూ పిటీషనర్ ను కోర్టు ఆదేశించింది.