Perni Nani’s Meeting With Mohanbabu : మోహన్‌బాబుతో పేర్ని నాని భేటి.! ఈ రాజకీయమేంటి.?

Perni Nani’s Meeting With Mohanbabu :మోహన్‌బాబు సీనియర్ నటుడు.. పైగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మోహన్‌బాబు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అన్నట్టు, మోహన్‌బాబుకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం కూడా వుంది. సో, మోహన్‌బాబుతో వైసీపీ నేత పేర్ని నాని భేటీ అవడంలో వింతేమీ లేదు. జస్ట్, ఇదొక రాజకీయ భేటీగానే చూడాలేమో.

కానీ, సినీ పరిశ్రమ తరఫున.. అంటూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం విదితమే. ఈ భేటీ విషయమై సినీ పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సరిగ్గా ఈ సమయంలోనే, మంత్రి పేర్ని నాని హైద్రాబాద్ వచ్చి మరీ మోహన్‌బాబుని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్నటి చిరంజీవి అండ్ టీమ్ భేటీకి సంబంధించిన వివరాల్ని పేర్ని నాని, మోహన్‌బాబు ముందుంచారనే ప్రచారం జరుగుతోంది.

కొన్నాళ్ళ క్రితం చిరంజీవి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంపై, ‘అది వ్యక్తిగతం..’ అని ఇటీవలే మంచు విష్ణు వ్యాఖ్యనించారు. మరి, పేర్ని నాని – మోహన్‌బాబు భేటీని ఎలా విష్ణు అభివర్ణిస్తారట. పరిశ్రమ పెద్దగా మోహన్‌బాబుని గుర్తించి ఆయన వద్దకు మంత్రి పేర్ని నానిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపించారనే ప్రచారం ఓ వైపు జరుగుతోంది. ‘మంత్రి పేర్ని నాని, హైద్రాబాద్ వచ్చారు.. మోహన్‌బాబుని కలిశారు.. చిరంజీవి అండ్ టీమ్, అదే పేర్ని నాని సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఏపీ వెళ్ళారు..’ అనే చర్చోపచర్చలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.