Kakinada Port: కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్, అదే సమయంలో కెన్ స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారని పేర్ని నాని ప్రశ్నించారు. కెన్ స్టార్ షిప్‌లో బియ్యం తరలిస్తున్నారన్న అనుమానాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
పవన్ స్టెల్లా షిప్‌లో తనిఖీ చేసినట్టు చెబుతూనే, కెన్ స్టార్ షిప్‌లోకి అనుమతి ఇవ్వలేదని అంటున్నారని నాని వ్యాఖ్యానించారు. “పోర్టు అధికారులే అనుమతి ఇచ్చారు కదా, మరెవరు అనుమతి ఇవ్వాలి?” అంటూ ఆయన ప్రశ్నించారు. పవన్‌ను స్టెల్లా షిప్‌పై ఫోకస్ చేయించి, కెన్ స్టార్ షిప్‌పై విచారణ జరగకుండా కాపాడేందుకు ప్రత్యేక వ్యూహం ఉందా అని సందేహం వ్యక్తం చేశారు.
కెన్ స్టార్ షిప్‌ను వదిలేయాలన్నది చంద్రబాబు సూచన కాదా? లేక ఇది పవన్ స్వంత నిర్ణయమా అని పేర్ని నాని ప్రశ్నించారు. నిన్న పవన్ చేసిన ఆరోపణలు, స్టెల్లా షిప్‌లో బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న వ్యాఖ్యల వెనుక నిజాలేమిటి అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు.
కాకినాడ పోర్టు ప్రభుత్వానికి చెందినది, మరి అరబిందో కంపెనీ పేరు ఎందుకు తెరపైకి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ ఆరోపణల వెనుక రాజకీయ ఎజెండా ఉందా? లేక మరేదైనా వ్యూహం ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైందని అన్నారు. ఇక మీదట మరిన్ని స్పష్టతలతో ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉందని నాని పేర్కొన్నారు.