స్కిల్ స్కాం తీగ మాత్రమే… డొంకల వివరాలు చెబుతున్న పేర్నినాని!

స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు, అనంతరం రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం ఏపీసోడ్ పై అవగాహనా లేకుండా కొంతమంది అర్ధజ్ఞానంతో మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే వరకూ చంద్రబాబుని ఏపీ పోలీసులు ఎలా ట్రీట్ చేశారనే విషయాలపై పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.

చంద్రబాబు విషయంలో సీఐడీ అధికారులు అన్ని నిబంధనలూ పాటించినట్లు తెలిపిన పేర్ని నాని… సీఐడీ అధికారులు, పోలీసులు చంద్రబాబుకు ఎంతో మర్యాద ఇచ్చారని తెలిపారు. అరెస్టు సమయంలోనూ, తర్వాతా.. చంద్రబాబు ఎంత తిడుతున్నా సీఐడీ అధికారులు సంయమనం పాటించారని అన్నారు. అరెస్ట్‌ సమయంలో డీఐజీ స్థాయి వ్యక్తితో ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు.

చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండదు, ఆయన్ ఫోటోలు కనిపిస్తే తొలగించమని చెబుతారు కానీ… ఆయన సినిమాల్లోని డైలాగులు మాత్రం వాడతారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు… ఏమో తెలీదు, గుర్తులేదు, మరిచిపోయాను అనేవి మాత్రమే చెప్పారని అన్నారు.

371 కోట్ల రూపాయల స్కాం చేసిన దొంగను ట్రీట్ చేసినట్లు చేయకుండా… అధికారులు చంద్రబాబుని ఎంతో గౌరవంగా హుందాగా నడుచుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియని చంద్రబాబు బ్యాచ్, ఎల్లో మీడియా ఏది బడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇదే సమయంలో… చంద్రబాబు పాపాల భైరవుడు అని చెప్పిన పేర్ని నాని… యువతకు నైపుణ్యం పేరుతో కోట్లాది రుపాయలు దోచుకున్నారని.. అందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ దొరకడంవల్లే చట్ట ప్రకారమే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని అన్నారు. ఇన్నాళ్లకు న్యాయం, ధర్మం గెలిచిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.

అయితే ఈ స్కాం జస్ట్ తీగమాత్రమే అన్ని చెప్పిన పేర్ని నాని… ఇది లాగితే చాలా డొంక కదులుతుందన్ని తెలిపారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు ఎంత గడ్డి కరిచేందుకైనా దిగజారతారని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు పాపం ఇన్నేళ్లకు పండిందని, ఇది కేవలం తీగ మాత్రమే.. ఇంకా చాలా స్కామ్‌లు బయటకు వస్తాయని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ మొదలైనవి నెక్స్ట్ క్యూలో ఉన్నాయని స్పష్టం చేశారు.