ఏపీ క్యాబినెట్‌లో మంత్రుల పనితీరును సమీక్షించి ర్యాంకులు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పనితీరును కూడా ఈ ర్యాంకింగ్‌లో చేర్చడం విశేషం. సాధారణంగా ముఖ్యమంత్రి మొదటి స్థానంలో ఉంటారని అందరూ భావించినా, చంద్రబాబుకు మాత్రం ఆరో ర్యాంకు మాత్రమే దక్కింది. దీని వల్ల అతని మంత్రివర్గంలో మరికొందరు మంత్రులు బాబు కంటే మెరుగైన పనితీరు చూపిస్తున్నారన్న భావన పెరిగింది.
టాప్ ర్యాంకును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ దక్కించుకోవడం విశేషం. ఫైళ్లను వేగంగా క్లియర్ చేస్తూ, అధికారులతో సమర్థంగా వ్యవహరిస్తూ మంచి మార్కులు కొట్టేశారు. రెండో స్థానంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మూడో స్థానంలో చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. నాలుగో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఐదో స్థానంలో సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బలవీరాంజనేయ స్వామి ఉన్నారు.
ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే, టాప్-5 లో ఇద్దరు జనసేన మంత్రులు చోటు సంపాదించగా, మిగతా ముగ్గురు టీడీపీకి చెందినవారు. ఇదే విధంగా, చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎనిమిదో ర్యాంకులో ఉన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
ఈ ర్యాంకుల ప్రక్రియ కేవలం 7 నెలల పాలన ఆధారంగా జరిగినప్పటికీ, ఇది మంత్రుల పనితీరుపై దృష్టిని కేంద్రీకరించేందుకు ఉపయోగపడుతోంది. ముఖ్యంగా, చంద్రబాబు తనను కూడా ర్యాంకింగ్‌లో చేర్చి, అనూహ్యంగా ఆరో స్థానంలో ఉంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది ఆయన నిస్పాక్షికతకు నిదర్శనం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.