ఇతను చనిపోయాడు.. అయినా వార్డుమెంబర్ గా గెలిచాడు

మృత్యువు అతనిని తీసుకెళ్లినా విజయం అతనిని ముద్దాడింది. ప్రజల హృదయాలను గెలుచుకొని వారి జీవితాల్లో నిలిచిపోయాడు. తను జీవంగా లేకున్నా తన మంచితనం సజీవంగా ఉందని నిరూపించాడు.  

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాజుతండా గ్రామం కొత్తగా పంచాయతీగా ఏర్పడింది. రాజుతండా 3 వ వార్డు మెంబర్ గా కాంగ్రెస్ బలపర్చిన బానోత్ భాస్కర్(28) నామినేషన్ వేశాడు. ఇతను ఎంటెక్ చదివి కారేపల్లి ఇంజనీరింగ్ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. గిరిజన ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో అతను బరిలోకి దిగాడు. సోమవారం ఎన్నికలు ఉండగా భాస్కర్ గుండెపోటుతో శనివారం చనిపోయాడు. దీంతో తండాలో విషాద చాయలు అలుముకున్నాయి.

 సోమవారం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 3 వ వార్డుకు కూడా అధికారులు ఎన్నికలు నిర్వహించారు. భాస్కర్ చనిపోయిన ఆ ప్రజలు మాత్రం అతనికి ఓటేసి గెలిపించారు. తన ప్రత్యర్ధికంటే 25 ఓట్లు అధికంగా సాధించి విజేతగా నిలిచాడు. మనిషి రూపంగా మధ్యలో లేకపోయినా తన ఆశయాలు బతికే ఉన్నాయని ప్రజలు అన్నారు. మరి భాస్కర్ స్థానంలో వార్డు మెంబర్ బాధ్యతలు వారి కుటుంబంలో ఒకరు నిర్వహించే అవకాశం ఉంది. అధికారులు కూడా ప్రజా తీర్పును గౌరవించి భాస్కర్ ను విజేతగా ప్రకటించారు. వాస్తవానికి అభ్యర్ధి చనిపోయినప్పుడు అధికారులు ఎన్నిక నిలిపేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి. కానీ మిగిలిన వారు, గ్రామస్థులు అభ్యంతరం చెప్పకపోవడంతో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో భాస్కర్ చనిపోయినా భాస్కర్ మంచితనాన్ని గుర్తించి ప్రజలు మానవత్వాన్ని చాటారు. 

భాస్కర్ విద్యావంతుడు కావడంతో నిత్యం ప్రజలను చైతన్య పరిచాడని తెలుస్తోంది. విద్యా విలువను తెలియజేస్తూ విద్యార్దులను ప్రోత్సాహించాడు. గ్రామంలో కూడా ప్రచారం చేస్తూ తన జీవితం ప్రజలకే అంకితం అని చెప్పాడని తెలుస్తోంది. మంచి గుణవంతుడ, ఆపదలో ఆదుకునే మనస్సు కలవాడు కావడంతో ప్రజలంతా ఆయనకే మద్దతు పలికారు. కానీ హఠాత్తుగా భాస్కర్ మరణించడంతో విషాద చాయలు అలుముకున్నాయి. భాస్కర్ బతికి ఉంటే తమ జీవితాలు బాగుండేవని తండా వాసులు కన్నీరు పెట్టారు. భాస్కర్ తమ మధ్య లేకపోయినా జీవితాంతం గుర్తుండేలా అతడికి ఓటు వేసి గెలిపించమని తండా వాసులు తెలిపారు. భాస్కర్ స్థానంలో వార్డు మెంబర్ గా వారి కుటుంబంలో ఎవరు బాధ్యతలు స్వీకరించిన సంతోషిస్తామని వారన్నారు.