అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలపై చర్చకు వైసిపి బహింగ సవాలు విసిరింది. పాదయాత్రలో వైఎస్ జగన్ 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్రమంతటా సంఘీభావ యాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పెనుకొండ నియోజకవర్గంలో సమన్వయకర్త శంకర నారాయణ పాదయాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది వాస్తవం కాదా అంటూ టిడిపి ఎంఎల్ఏ బికె పార్ధసారధిని నిలదీశారు.
పెన్నా నది నుండి ఇసుకను పార్ధసారధి అక్రమంగా తవ్వేసుకుని కర్నాటకకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎంఎల్ఏ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకూ అక్రమంగా ఎంత సంపాదించారనే విషయంపై తాను ఎంఎల్ఏతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమన్వయకర్త ఓపెన్ చాలెంజ్ చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఎంఎల్ఏ అక్రమాలకు అంతు ఉండటం లేదని విరుచుకుపడ్డారు.
పాదయాత్రలో భాగంగా తాను రెండు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటానని ఎంఎల్ఏ అక్రమాలు, అవినీతిని బయట పెట్టటానికి ఎవరితో అయినా చర్చకు తాను సిద్దంగా ఉన్నట్లు శంకర్ చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఇపుడు జరిగిందని చెబుతున్న ఎంఎల్ఏ ఆ అభివృద్ధి ఏంటో చూపిస్తారా ? జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ నిలదీయటం ఇపుడు చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని పక్కనపెట్టి ముందు తన ఆస్తుల విషయంలో అభివృద్ధి గురించి చెప్పాలంటూ ఎంఎల్ఏని శంకరనారాయణ చాలెంజ్ కు టిడిపి నుండి సమాధానం వస్తుందా ?