ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీ, చంద్రబాబు హయాంలో పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కీలక నివేదిక తయారు చేసే పనిలో వుంది. డాటా చౌర్యం జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందనీ హౌస్ కమిటీ సభ్యుడు, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. అంటే, ఈ వ్యవహారంలో చంద్రబాబు దాదాపుగా దోషి అన్నట్టే లెక్క.
అసలు, హౌస్ కమిటీ గనుక చంద్రబాబుని దోషిగా తేల్చితే ఏమవుతుంది.? చంద్రబాబు జైలుకు వెళతారా.? లేదంటే, ఇంకేమైనా చర్యలు వుంటాయా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
అధికారంలో వున్నది వైసీపీనే గనుక, అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య నామమాత్రమే గనుక, చంద్రబాబుని దోషిగా చూపడం హౌస్ కమిటీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ, హౌస్ కమిటీ.. అంటే, దానికి ఓ గౌరవం వుంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సి వుంటుంది హౌస్ కమిటీలు. అవి అలా పనిచేస్తాయా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
చంద్రబాబు హయాంలో డేటా చౌర్యం, వ్యక్తిగత సమాచారం తస్కరణ, ఫోన్ ట్యాపింగ్.. ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుని పావుగా వాడుకుని, చంద్రబాబు తన ‘కార్యాలు’ వెలగబెట్టుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.
కాగా, పెగాసస్ అనేది విదేశీ సాఫ్ట్‌వేర్. దాన్ని కొనుగోలు చేయాలంటే కేంద్రం అనుమతి వుండాలి. మరి, కేంద్రం అనుమతిచ్చినట్లు ఆధారాలున్నాయా.? రాష్ట్రం కొనుగోలు చేసినట్లు ఆధారలున్నాయా.? అంతా గందరగోళమే.! కానీ, ఆరోపణలు మాత్రం ఘనంగా వున్నాయ్.