Payyavula Alleges YSRCP: దొంగ ఓట్లపై రాహుల్‌కు వైసీపీ హాట్‌లైన్ ట్యూషన్: మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్

అమరావతి: దొంగ ఓట్ల వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ ఎందుకు మౌనంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఈ దొంగ ఓట్ల విషయంలో వైఎస్సార్సీపీ వారే హాట్‌లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్లు ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

వైసీపీ దొంగ ఓట్ల కుట్రను ఉరవకొండ నుంచే మొదలుపెట్టిందని, అయితే తాము ప్రజలనే నమ్ముకున్నామని, దొంగ ఓట్లను కాదని పయ్యావుల స్పష్టం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో తాము బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.

గిఫ్ట్‌లు, రిటర్న్ గిఫ్ట్‌లు ఏమయ్యాయి? 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ సభ్యుడేనని గుర్తుచేసిన పయ్యావుల, వైసీపీ అధినేత జగన్‌కు, కేసీఆర్‌కు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వారు ఒకరికొకరు ఇచ్చుకున్న “గిఫ్ట్‌లు, రిటర్న్ గిఫ్ట్‌లు” ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ప్రజలను, క్యాడర్‌ను రెచ్చగొట్టడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పులివెందుల ప్రజలు ఈసారి ధైర్యంగా వచ్చి ఓటు వేశారని, రేపు రాబోయే ఫలితాలను స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

చంద్రబాబే పదేళ్లు సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడని, మరో పదేళ్లపాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని పయ్యావుల కేశవ్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. జగన్ హయాంలో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు ఉండేవని, తమ ప్రభుత్వంలో పోలీస్ శాఖ స్వతంత్రంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకుని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసలు అర్హులుగా ఉంటారో లేదో చూసుకోవాలని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.

Journalist Bharadwaj Mayasabha Web Series Review | Deva Katta | Aadhi Pinishetty | Chaitanya Rao |TR