తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో పార్టీలన్ని తాము అనుసరించాల్సిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ముందస్తు ఎన్నికలపై జనసేనలో కూడా చర్చల ప్రక్రియ జోరందుకుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో పవన్ ఆదివారం చర్చించారు. తెలంగాణలో పార్టీకి ఉన్న బలం, ఏయే స్థానాల్లో పోటి చేయాలనే విషయాలతో పాటు కాంగ్రెస్ టిడిపితో జతకడుతుందని వస్తున్న వార్తలపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే జనసేనతో జట్టు కట్టేందుకు సీపీఎం తెలంగాణ కమిటీ ముందుకు వచ్చింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వలోని బృందంతో పార్టీ వ్యవహారాల కమిటి చర్చలు జరిపింది. చర్చలు ఫలప్రదంగా జరిగాయని మరో దఫా చర్చల్లో పవన్ పాల్గొనాల్సిందిగా నేతలు పవన్ కు సూచించారు.
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా బహిరంగంగా మాట్లాడలేదు. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని గతంలో పవన్ మెచ్చుకున్నాడు అంతే కాకుండా కేసీఆర్ ను రెండు మూడు సార్లు కలిశాడు.
పవన్ ఇప్పుడు సీపీఎంతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. కేసీఆర్ ను బహిరంగంగా పవన్ విమర్శించలేని పరిస్థితి ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పవన్ సినిమాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు ప్రాంతీయ భేదం తీసుకొచ్చి ఆంధ్రా ప్రాంతం అని తెలంగాణ వాదులు ముద్రవేసే అవకాశం ఉంది. వీటన్నింటి ప్రభావంతో పవన్ అసలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడా లేదా అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే జనసేనాని నోరు విప్పడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరీ జనసేనాని ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు జనసేనను సంప్రదిస్తున్నారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా కష్టపడి పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తారని జనసేన కీలక నేతల ద్వారా తెలుస్తోంది.