‘కాకినాడ సెజ్’ దోపిడీలో చంద్రబాబు, జగన్ కు వాటా? : పవన్ అనుమానం

 

కాకినాడ సీపోర్టు దోపిడీ వ్యవహారంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు , ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి  ఎందుకు  మాట్లాడంలేదని  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు.

ఈ రోజు ఆయన కాకినాడ సెజ్ బాధితులతో మాట్లాడారు. ఈ దోపిడీకి కారణమయిన కెవిరావు అనే వ్యక్తిని భారత దేశానికి రప్పించి విచారణ జరిపిస్తామని కూడా ఆయన చెప్పారు.  జనసేన అధికారంలోకి వస్తే పోర్ట్ లైసెన్స్ ను రద్దు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.  ఈ పోర్టు దోపిడీ గురించి స్పందించి తమ వైఖరి చెప్పకపోతే, దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు, జగన్ లకు కూడా భాగస్వామ్యం ఉందని అనుకోవలసి వస్తుందని ఆయన తీవ్రమయిన వ్యాఖ్య చేశారు.

ఈ ‘కెవి రావు గురించి అమెరికాలో నాకు తెలిసిన సెనెటర్స్ తో సంప్రదిస్తా. అవసరమయితే ఎఫ్ బిఐ కి కూడా ఫిర్యాదు చేస్తాం. కాకినాడ పోర్టు అవకతవకలమీద  సంజాయిషీ ఇవ్వాలని ప్రభుత్వం, ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తున్నా,’ అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏమూలకి వెళ్లినా ఇసుక దోపిడీ , ఇసుక మాఫీయా. కాకినాడ  సీపోర్టు యజమాని విశాఖ లో ఒక చిన్న సినిమా ధియోటర్ యజమాని. అతన్ని మెలో డి వెంకటేశ్వరరావు అనే వారు. సినిమాల్లో ఉన్నపుడు ఒకటి రెండు సార్లు కలిశాను. పోర్టు దక్కించేకున్నాక అతని ఆస్తి వేల కోట్లకు పెరిగింది, ఎలా పెరిగింది. అమెరికా సిటిజన్ అయిన అతనికి ఎలా అనుమతిస్తారు. ఆయన్ని భారత్ కు రప్పించి లెక్కలు చెప్పించాల్సిందే.ఈ ప్రాజక్టు వల్ల పర్యావరణమేకాదు, మత్య్సకారుల జీవితాలు కూడ నాశనమయ్యాయి. అయినా ప్రతిపక్ష నేత జగన్ ఏమీ మాట్లాడంలేదు. ఆయనకు ఇందులో  భాగముందనుకోవాలా,’ అని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట ఎస్ఇజడ్ భూములలో, పునరావాస కాలనీలో పవన్‌ పర్యటించారు. కాకినాడ ఎస్ఈజడ్‌లో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉద్యోగమూ ఇవ్వలేదని అన్నారు. కేవీరావు అనే వ్యక్తి భూములను అడ్డగోలుగా ఇంకో సంస్ధకు అమ్మి ,  అమెరికాలో ద్రాక్షతోటలు కొనుగోలు చేశారని పవన్ ఆరోపించారు. అడ్డగోలు భూదాహానికి అధికారులు బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో పాదయాత్ర చేసిన జగన్‌కి ఎస్ఈజడ్ సమస్య కనిపించలేదా అని పవన్ ప్రశ్నించారు.