గంటా పక్షి లాంటోడు.. పక్షులకు నో ఎంట్రీ..పవన్

మంత్రి గంటా శ్రీనివాస్ రావు పక్షిలాంటోడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కాబట్టి జనసేనలోకి గంటాకు ఎంట్రీ ఇవ్వటం లేదని పవన్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో వామపక్షాల జాతీయ నేతలతో పవన్ భేటీ అయ్యారు లేండి. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే విషయాన్ని తేల్చుకోవటానికే సమావేశం జరిగింది. అయితే, సీట్ల సర్దుబాటుపై ఎటువంటి నిర్ణయం జరగలేదనుకోండి అది వేరే సంగతి.

ఆ సందర్భంగా ఇతర పార్టీల్లోని నేతలను జనసేనలోకి ఆహ్వనించే విషయం వారిమధ్య చర్చకు వచ్చింది. అందులోను గంటా లాంటి నేతలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే గంటా జనసేలో చేరుతున్నారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. ఆ విషయంపైనే పవన్ స్పందిస్తు గంటా లాంటి వాళ్ళకు తమ పార్టీలో చోటు లేదన్నారు. గంటా పక్షిలాంటి వాడని ఎద్దేవా చేశారు. పక్షులు ఒకచోట స్ధిరంగా ఉండవని కాబట్టి పక్షులకు జనసేనలో చోటు కల్పించటం లేదని నిర్మొహమాటంగా చెప్పారు.

గంటాను పక్షితో పోల్చటం వరకు కరెక్టే. పక్షిలాంటి వాళ్ళకు జనసేనలో  చోటు కల్పించటం లేదని అనుకోవటం వరకూ ఓకేనే. కానీ జనసేనేదో నేతలతో కిటకిట లాడుతున్నట్లుగా పవన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఈడ్చి కొడితే నలుగురు నేతలు కూడా లేరు పార్టీలో. అటువంటి జనసేనకు పక్షులైతే ఏంటి, ఎవరైతే ఏంటి ? రేపటి ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్ధులు దొరకలేదంటే పవన్ కే అవమానం. పైగా గంటాకు ఆర్ధిక, అంగబలం పుష్కలంగా ఉంది. కాబట్టి గంటానో లేకపోతే గంటా లాంటోళ్ళో ఎవరో ఒకరైతే అవసరం ఉంది కదా ? మరి ఎటువంటి వాళ్ళు వచ్చి చేరుతారో చూడాల్సిందే.