పవన్ కళ్యాణ్ ‘వారాహి’ సిద్ధం.! యుద్ధానికి సేనాని సిద్ధమేనా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటనల కోసం వినియోగించనున్న వాహనం సిద్ధమయ్యింది. దీనికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ వాహనాన్ని తలపించేలా ఈ వాహనానికి ‘నాచురంగు’ని అద్దారు.

కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి బోల్డన్ని హంగులు అద్ది, ఎన్నికల ప్రచార వాహనంగా తయారు చేశారు. దేశంలో ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడూ ఇలాంటి వాహనం వినియోగించలేదా.? అంటే, చాలా మంది రాజకీయ నాయకులు చాలా రకాల వాహనాలు వినియోగిస్తూ వస్తున్నారు. దేనికదే ప్రత్యకం. వాటిల్లో ‘వారాహి’ ఇంకాస్త ప్రత్యేకం.

వాహనం సరే, యుద్ధం చేయాల్సిన జనసేనాని సంగతేంటి.? ఇదే మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఏ క్షణాన అయినా ఎన్నికలు రావొచ్చంటూ ఏపీ రాజకీయాల్లో నిరంతరం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినాగానీ, జనసేనాని మాత్రం కేవలం వీకెండ్ రాజకీయాలే చేస్తూ వెళుతున్నారు. వాహనాలతో ఏమొస్తుంది.? వాహనాలు వున్నా లేకున్నా, ప్రజల్లో మమేకమవ్వొచ్చు. అయితే, ఈ వాహనం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో స్పెషల్

ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తున్నమాట వాస్తవం. విపరీతమైన ఎలివేషన్స్ ఇస్తున్నారు జనసేనానికి ‘వారాహి’ వాహనం పేరు చెప్పి. ‘అదంతా తర్వాత, ముందైతే జనసేన మద్దతుదారులు, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి..’ అని జనసైనికులే సూచిస్తున్న పరిస్థితి.