బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలిస్తుందా.? లేదా.?

టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా.? రాదా.? అన్నదాని విషయమై జనసేన పార్టీ ఒకింత గుస్సా అవుతోంది. ‘మేం జనసేనతోనే కలిసి వున్నాం’ అని బీజేపీ అంటోంది. కానీ, ‘మేం టీడీపీతో కలిసి వున్నాం’ అని జనసేన చెబుతోంది. మరి, టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కలిసేదెప్పుడు.?

వాస్తవానికి, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబుకి దగ్గరగా జరిగారో, అప్పటినుంచే బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ పెరిగింది. కాకపోతే, కర్ర విరగకుండా.. పాము చావకుండా.. అన్న చందాన ఇటు జనసేన, అటు బీజేపీ.. రెండూ సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా, బీజేపీ విషయంలో సానుకూలంగా వున్నా, ఆ విషయాన్ని పూర్తిగా బయటపెట్టడంలేదాయన.

ఎన్నికలు సమీపిస్తున్నాయ్. ఏదో ఒకటి తేల్చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. అయితే, ఆయన ముందుగా బీజేపీ అధినాయకత్వంతో భేటీ అవ్వాలి. ఆ తర్వాతే టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా.? రాదా.? అన్నదానిపై స్పష్టత వచ్చేది.

ఇంకోపక్క, బీజేపీలో కొందరు నేతలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దాంతో, గందరగోళం ముదిరి పాకాన పడుతోంది. ‘పొత్తుల విషయాన్ని బీజేపీ అధినాయకత్వం తేల్చుతుంది..’ అని అంటున్న పురంధీశ్వరి, ప్రస్తుతానికైతే జనసేనతోనే తమ పొత్తు.. అని చెబుతుండడం గమనార్హం.

కాగా, వైసీపీ నుంచి ఓ టీమ్, బీజేపీ అధినాయకత్వంతో రెగ్యులర్‌గా మంతనాలు జరుపుతోంది. అయితే, బీజేపీ అడుగుతున్న ఎంపీ సీట్లు ఇచ్చే విషయమై వైసీపీ తటపటాయిస్తోందిట. బీజేపీ గొంతెమ్మ కోర్కెల దగ్గరే టీడీపీ – జనసేన కూటమి కూడా ఎటూ తేల్చుకోలేకపోతోందన్నది ఓ వాదన.

ఏమో, రానున్న రోజుల్లో ఈ మొత్తం గందరగోళానికి ఓ తెర పడుతుందేమో.! టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీని లాక్కు రావడం అనేది పెద్ద టాస్క్ అయి కూర్చుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌కి.!