జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ టూర్ షెడ్యూల్ మారుతుందా.. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే ఛాన్స్ మిస్సవుతుందా.. ఒక వేళ అనుమతి వచ్చినా కండిషన్స్ గట్టిగానే ఉండబోతున్నాయా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా 13 తారీఖున కాకుండా… ఈరోజే పవన్ ఏపీకి ప్రయాణమయ్యారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన షెడ్యూల్ మారింది. ఇవాళే ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారాహి యాత్ర షెడ్యూల్ పైనా, పోలీసుల అనుమతులపైనా, తాజాగా తెరపైకి వచ్చిన సెక్షన్ 30పైనా చర్చించేందుకు నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా… యాగం నిర్వహణ విషయంలో కూడా షెడ్యూల్ మారనుందని తెలుస్తుంది.
జనసైనికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రోజు దగ్గర్లోనే ఉంది. ఈ నెల 14వ తేదీన వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో నుంచి ఈ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. అవును… అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈనెల 30వ తేదీ వరకు పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని డీఎస్పీ అంబికా ప్రసాద్ ప్రకటించారు.
ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారాహి యాత్రకు దొరికే అనుమతులు, అందుకు పోలీసులనుంచి వచ్చే కండిషన్లపై తెగ చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వం కావాలనే వారాహి యాత్రను అడ్డుకుంటుందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అయితే… అమలాపురం కేంద్రంగా గతంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలోనే ఈ సెక్షన్ మరోసారి తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారంట!
కాగా, ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా ఐదు బహిరంగ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. జూన్ 14న – కత్తిపూడి జంక్షన్ లో.. జూన్ 16న – ఉప్పాడ జంక్షన్ లో.. జూన్ 18న – కాకినాడ సర్పవరం జంక్షన్ లో.. జూన్ 21న – అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో.. జూన్ 22న – రాజోలు నియోజకవర్గంలోని మల్కిపురం సెంటర్ లో బహిరంగ సభలు నిర్వహించేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది.