ప్రధాని మోడీ విశాఖ పర్యటన: పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానమెందుకు రాలేదు.?

తనకు బీజేపీ జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందులో నిజం లేకపోలేదు. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడేమో బీజేపీ అగ్రనాయకత్వం జనసేన అధినేతని పూర్తిగా లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితర బీజేపీ ముఖ్యులతో పవన్ కళ్యాణ్ భేటీ అయి చాలాకాలమే అయ్యింది. ఆ మాటకొస్తే, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకులతో భేటీ అయ్యిందే లేదు.! సో, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్‌కి పెద్దగా సీన్ వుండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. విశాఖ పర్యటనని బీజేపీ ‘ప్రధాని అధికార పర్యటన’ అంటోంది. అధికారిక పర్యటన, అనధికారిక పర్యటన.. అనేమీ వుండవు రాజకీయ నాయకులకి. అధికారికంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, రాజకీయంగా ఇంకొన్ని కార్యక్రమాలు ఎలాగూ వుంటాయి.

వివాఖపట్నంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ జరుగుతాయట ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా. అన్నట్టు, చివరి నిమిషంలో రైల్వే జోన్ వ్యవహారాన్ని ప్రధాని అధికారిక కార్యక్రమాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. విశాఖలో ఆందోళనలు చేపట్టారు. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గుతామని ప్రధాని మోడీ ప్రకటించాలన్నది స్టీలు ప్లాంటు కార్మికుల డిమాండ్. కానీ, అది జరిగే పని కాదు. ఎందుకంటే, విశాఖ స్టీలు ప్లాంటుని అమ్మేయాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మకం పనులూ జోరుగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మోడీ విశాఖ పర్యటనపై జనసేన పెదవి విప్పడంలేదు. జనసేనాని కూడా మోడీ విశాఖ పర్యటనని పట్టించుకోనట్లే కనిపిస్తోంది.