రాజకీయాలు చేయడానికి, సినిమాలు ఇంధనంగా తనకు పని చేస్తాయని పదే పదే చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ఆలోచనల్ని తప్పుపట్టలేం. కానీ, చేస్తున్నదేంటి.? రాజకీయాల్ని వదిలేసి, సినిమాలు.. సినిమాల్ని వదిలేసి రాజకీయాలు.. రెంటికీ న్యాయం చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్.
వారాహి విజయ యాత్ర ప్రారంభించారు. మూడు విడతలు పూర్తి చేశారు. తర్వాతి విడత ఎప్పుడు.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓ రెండు మూడు నెలలు పూర్తిగా ఆయన సినిమాలకే సమయాన్ని కేటాయిస్తారట. ఇదెంత నిజం.? అన్నది ముందు ముందు తేలుతుంది.
నిజానికి, వారాహి విజయ యాత్రతో పవన్ కళ్యాణ్‌కి మంచి పొలిటికల్ మైలేజ్ వచ్చింది. జనసేన పార్టీ పట్ల జనంలోనూ కొంత సానుకూలత కనిపించింది. ఇంతలోనే, రాజకీయ తెరపైనుంచి పవన్ కళ్యాణ్ మాయం. సినిమాలు చేయడం తప్పు కాదు. ప్రత్యక్షంగానో పరోక్షంగా రాజకీయ తెరపై తాను నిత్యం అందుబాటులో వుండేలా చూసుకోవాలి.
కానీ, అది పవన్ కళ్యాణ్‌కి సాధ్యం కావడంలేదు. పవన్ కళ్యాణ్ తర్వాత జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరూ లేరన్నది చాలాకాలంగా వస్తోన్న విమర్శ. అలాంటి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ ఇంతవరకు తయారు చేసుకోలేకపోయారు. అదే జనసేనకి అతి పెద్ద సమస్య.
తెలంగాణలో ఎన్నికల హంగామా కనిపిస్తోంది. అధికార భారత్ రాష్ట్ర సమితి తమ అభ్యర్థుల్నీ ప్రకటించేసింది. జనసేన కూడా ఆ దిశగా కసరత్తులు చేయాలి కదా.? ఎందుకంటే, తెలంగాణలోనూ పోటీ చేస్తామని జనసేనాని స్వయంగా గతంలో ప్రకటించారు మరి.
త్వరలో రాయలసీమలో వారాహి యాత్ర.. అంటూ జనసేన లీకులు పంపుతోంది. నిజమేనా.? అయితే, రానున్న రెండు మూడు నెలల్లో వుంటుందా.? వేచి చూడాల్సిందే.