టైం మారింది… పవన్ తగ్గక తప్పదు!

ఎవరు ఎన్ని చెప్పినా, ఎలా చెప్పినా ఏపీలో ఎప్పుడు రెండు పక్షాల మధ్యే పోటీ జరుగుతుంటుంది. మిగిలిన పార్టీలో ఈ రెండు బలమైన పక్షాల్లో ఏదో ఒక పంచన చేరాలై చెబుతుంటారు. అయితే నిన్న మొన్నటివరకూ ఏపీలో మూడో పార్టీకి ఇండివిడ్యువల్ గా పోటీ చేయడానికి ఛాన్స్ ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. అయితే ఆ అవకాశాన్ని పవన్ కల్యాణ్ ఎడమ కాలితో తన్నుకునాడని చెబుతుంటారు. ఇప్పుడు అదే తాను పూర్తిగా తగ్గాల్సిన పరిస్థితి కల్పించిందని చెబుతున్నారు.

అవును… ఏపీలో 2019 ఎన్నికల తర్వాత చూసుకుంటే అధికార వైసీపీ చాలా బలపడిపోయింది. ఏకంగా 151 సీట్లతో చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చింది. ఇటీవల కాలంలో పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న సమస్యలు వస్తున్నప్పటికీ… అంత భారీ స్థాయిలో నేతలు హోప్స్ పెట్టుకున్నప్పుడు ఇవి అత్యంత సహజం. అందుకే అధినాయకత్వం కూడా ఆ సమస్యలను టీకప్పులో తుఫాను మాదిరిగా చల్లబరిచేస్తుంది. ఈ రోజు పత్రికల్లో బ్యానర్ ఐటం అవుతున్న ఆ సమస్య మరుసటి రోజు మాయమైపోతుంది.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయ్యారు. పార్టీ ఒక్కసారిగా కుదేలైందనే కామెంట్లు వినిపించాయి. నాయకులను, ప్రధానంగా కేడర్ ను అమోయమయంలో పడేసి అన్నట్లుగా చంద్రబాబు తర్వాతి నాయకత్వం కాలానికే వదిలేసింది. చినబాబు హస్తినకే పరిమితమైపోయారు. ఆ సమయంలో కూడా పవన్ కు సువర్ణావకాశం వచ్చింది. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అనుకుని.. తన పని తాను రాజకీయంగా చేసుకునిపోలేకపోయారు!

దీంతో రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారికి పవన్ పొలిటికల్ ఫ్యూచర్ పై ఒక క్లారిటీ వచ్చేసింది! కట్ చేస్తే… చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. దీంతో బాబు ఈజ్ బ్యాక్ అంటూ టీడీపీలో కొత్త ఉత్సాహం తెరపైకి వచ్చింది. నాయకులు, కేడర్ తిరిగి యాక్టివ్ అయ్యారు. దీంతో పవన్ పరిస్థితి మరోసారి ఆటలో అరటిపండు అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం సీట్ల సర్ధుబాటులో చర్చలు!

వాస్తవానికి హరిరామ జోగయ్య లేఖల్లో వాపోతున్నట్లు జనసేన కనీసం 50 స్థానాల్లో పోటీ చేయగలిగితే కాస్త నిలబడగలుగుతుంది. అందులో కనీసం 20 నుంచి పాతిక సీట్లు అయినా ఇండివిడ్యువల్ గా గెలిస్తే… కచ్చితంగా రేపటి రోజున చక్రం తిప్పే విషయంలో ఛాన్స్ ఉంటుంది! అయితే ఆ అవకాశాన్ని పవన్ వ్యూహాత్మకంగా వదిలేసుకున్నారు! టీడీపీ ఇచ్చే సీట్లకోసం ఎదురుచూస్తున్నారు!

ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కేడర్, నేతల్లో కాస్త ఉత్సాహం రాగానే పవన్ కు ఇచ్చే సీట్ల దార సన్నబడిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేనకు 20 సీట్లు మాత్రమే ఇచ్చే దిశగా టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. కారణం… ఇప్పుడు బాల్ పవన్ కోర్టులో లేదు.. చంద్రబాబు భుజాలపై పెట్టి లోకేష్ చేతుల్లో ఉంది!

దీంతో సమయం మించిపోయింది.. ఇప్పటికే చేతులే కాదు చాలా కాలిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదనే కామెంట్లు జనసేన నేతల ఇన్నర్ వాయిస్ అని అంటున్నారు పరిశీలకులు. కారణం… ఇప్పుడు చంద్రబాబు 175లోనూ కనీసం 150 పోటీచేయకుండా ఉండరు. పవన్ పై ఆధార పడి ప్రభుత్వాన్ని నెలకొల్పాల్సిన స్థితిని కోరి తెచ్చుకోరు!

అందువల్ల పవన్ కి 25లోపు మాత్రమే సీట్లు ఇచ్చేలా పంతంపట్టుకుని కుర్చున్నారని అంటున్నారు. ఇప్పటికే చినబాబు సైతం చాలా మందికి పర్సనల్ గా హామీ ఇవ్వడంతో.. బాబు తగ్గినా చినబాబు తగ్గే ప్రసక్తి లేదని చెబుతున్నారు. కానీ… పవన్ మాత్రం కనీసం 40 అయినా అనేకాడికి వచ్చారని అంటున్నారు. అది కేవలం భ్రమ మాత్రమే అని రిప్లై వస్తుందని తెలుస్తుంది.

అలా అని ఇప్పుడు పవన్ టీడీపీని వదిలి బయటకు వెళ్లలేరు. వెళ్తే చెల్లని నాణెం అయిపోతారని అంటున్నారు! టీడీపీలో ఉన్నా కూడా 20స్థానాలకు మించి దక్కని పరిస్థితి. అందులో ఎన్ని సీట్లు గెలిచినా ఓడినా తమకు ఏమీ ఫరక్ పడదనేది టీడీపీ నేతల ధీమాగా చెబుతున్నారు. కారణం… ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగితే అది మెజారిటీ స్థానాల్లో తమకే పడుతుంది.

జనసేనకు ఎంత పడినా 20 స్థానాలకు మించి పడే అవకాశం ఇస్తే… తమకు మ్యాజిక్ ఫిగర్ కి 4 – 5 స్థానాలు తక్కువ వస్తే.. పవన్ ని బ్రతిమాలుతూ కూర్చోవాలి! గొంతమ్మ కోర్కెలు తీర్చాల్సి రావొచ్చు! అలా కాకుండా పవన్ అవసరాన్ని ట్వల్త్ మ్యాన్ లా పెట్టుకుంటే… 2014 ఫలితాల అనంతరం తీసుకున్న డబుల్ స్టాండ్ తీసుకోవచ్చు.

2014 ఎన్నికల అనంతరం కొంతమంది టీడీపీ నేతలు… తమ గెలుపులో పవన్ పాత్ర కూడా ఉందని చెప్పేవారు. రాను రానూ 2009లో తన అన్న చిరంజీవినే గెలిపించుకోలేదు.. టీడీపీని పవన్ గెలిపించడం ఏమిటని షాక్ ఇచ్చారు. అయితే ఆ షాక్ నుంచి జనసైనికులు తేరుకున్నారో లేదో తెలియదు కానీ… పవన్ మాత్రం పుష్కలంగా తేరుకున్నారు.. తేలియాడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు సీట్ల విషయంలో తగ్గాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు డిమాండ్ కి అవకాశం లేదు… ఓన్లీ ఇచ్చినవి తీసుకుని అందులోనే సర్దుబాట్లు చేసుకుని… రాజకీయ చేసుకోవాల్సిందే! సో… ఇలా టీడీపీలో పొత్తులో ముందుకు వెల్లడం వల్ల మరో 10 – 15 ఏళ్లపాటు జనసేనను ఆటలో అరటిపండు చేసినట్లే చేశారు పవన్ కల్యాణ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! సో… టీడీపీకి టైం మారింది… సీట్ల విషయంలో జనసేన అధినేత పవన్ తగ్గక తప్పదు.. ఇచ్చినవి తీసుకోక తప్పదు!!