ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. వకీల్ సాబ్ మూవీ విడుదలైన సమయంలో ఏపీ సర్కార్ టికెట్ రేట్లను తగ్గించడంతో నిర్మాత దిల్ రాజు కోట్ల రూపాయలు నష్టపోయారు. కలెక్షన్లు తగ్గడం వల్ల హిట్ స్టేటస్ ను అందుకోవాల్సిన వకీల్ సాబ్ అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ప్రభుత్వం తక్కువ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శించేలా చర్యలు చేపట్టి ఏపీ బయ్యర్లకు భారీగా నష్టాలు రావడానికి పరోక్షంగా కారణమైంది. భీమ్లా నాయక్ మూవీ విడుదలైన పదిరోజుల తర్వాత ప్రభుత్వం కొత్త టికెట్ రేట్ల జీవోను విడుదల చేసి భారీ బడ్జెట్ సినిమాలకు ప్రయోజనం చేకూరేలా చేసింది. అయితే ఆ విషయాలను మనస్సులో ఉంచుకున్న పవన్ తాజాగా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా రిలీజ్ అవుతుందంటే జగన్ సర్కార్ కలెక్టర్ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతుందని పవన్ పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి వ్యవస్థలు ఎందుకు పని చేయవని పవన్ ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అద్భుతాలు చేయవచ్చని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు.
సినిమా రిలీజ్ సమయంలో ప్రభుత్వం యంత్రాంగం మొత్తాన్ని తిప్పగలదని ఇతర సమస్యలను పరిష్కరించడానికి మాత్రం ప్రభుత్వం ఎందుకు పని చేయదని పవన్ ప్రశ్నించారు. 5, 10, 15 రూపాయల సినిమాల కోసం వ్యవస్థను నడపగలరు కానీ సగటు మనిషి సమస్యల పరిష్కారం కోసం ఎందుకు రారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ముద్దుల మావయ్యకు నోట్లో నుంచి మాటలు బాగా వస్తాయని జేబులో నుంచి డబ్బులు తీయడం మాత్రం రాదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా పవన్ కళ్యాణ్ తన సినిమాల రిలీజ్ సమయంలో వైసీపీ సర్కార్ ఇబ్బంది పెట్టిందని అదే సమయంలో ప్రజల ఇబ్బందులను మాత్రం పట్టించుకోలేదని ప్రజలకు తన కామెంట్ల ద్వారా తెలిసేలా చేశారు.