హాట్ టాపిక్: పిఠాపురం విషయంలో పవన్ పునరాలోచన… తెరపైకి కొత్త పేర్లు!

ఈ నెల 14 నుంచి వారాహితో ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకున్న పవన్ కు ఒక బ్యాడ్ న్యూస్ రెడీ చేస్తుంది వైసీపీ. 14వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటరవ్వగానే… ఈ బ్యాడ్ న్యూస్ ను తెరపైకి తేవాలని చూస్తుంది. ఫలితంగా పవన్ నిర్ణయంలో మార్పు తీసుకొచ్చే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో… పవన్ పోటీచేయబోయే నియోజకవర్గంలో మార్పు వస్తుందా.. లేక, ఈసారి కూడా రెండుచోట్ల రంగంలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

జనసేనాని పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాలతో ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఈ సారి ఎలాగైనా తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టటంతో పాటుగా తన పార్టీకి తగిన గుర్తింపు దక్కాలనేది పవన్ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగానే వారాహి యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీతో కలిసి ముందుకు వెళ్లే క్రమంలో గోదావరి జిల్లాల బాధ్యతలు తీసుకున్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ పొత్తులో సీట్ల విషయంలో తనదే పైచెయ్యి ఉండేలా వ్యూహాలు పన్నుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రయోగాలు ఉండవని తేల్చి చెప్పిన పవన్… ఈ మధ్యకాలంలో పార్టీ బలం పెరిగిందని చెబుతున్నారు. అయితే ఆ బలం అధికారంలోకి రావడానికి సరిపోదు కానీ.. సీఎం ఎవరనే విషయాన్ని నిర్ణయించడానికి మాత్రం పనికొస్తాదని నమ్ముతున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తున్నారు. జగన్ ని దింపాలి.. బాబును ఎక్కించాలి అనే స్లోగన్ తో ముందుకు వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ పోటీచేస్తారని కథనాలొస్తున్నాయి. తాజా సర్వే కూడా ఈ ఆలోచనకు బలం చేకూర్చిందని అంటున్నారు. గతంలో భీమవరం – గాజువాకలు కొట్టిన దెబ్బను ఈ నియోజకవర్గం తగ్గిస్తాదని భావిస్తున్నారు. పైగా కాపు సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండే పిఠాపురం చాలా సేఫ్ అని నమ్ముతున్నారు. ఈ సమయంలో పవన్ కు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది!

అవును… పవన్ పోటీచేయాలని భావిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పోటీకి నిలబడబోతున్నారంట. ఆయన పోటీచేస్తారా.. లేక, ఆయన కుమారుడిని రంగంలోకి దింపుతారా అనేది ఇంకా ఫైనల్ కానప్పటికీ… ముద్రగడ ఫ్యామిలీ మాత్రం ఈసారి పిఠాపురం నుంచి వైసీపీ తరుపున పోటీచేస్తారని కథనాలొస్తున్నాయి. దీంతో… ఇది పవన్ కు కచ్చితంగా బ్యాడ్ న్యూసే అని అంటున్నారు పరిశీలకులు.

దీంతో… పవన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తుంది. పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం నుంచి కాకుండా… కాకినాడ రూరల్ నుంచి కానీ, ప్రత్తిపాడు నుంచి కానీ పోటీచేస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. అసలే ముద్రగడ.. పైగా వైసీపీ నుంచి పోటీ. దీంతో… పిఠాపురం విషయంలో పునరాలోచనే బెటరని పవన్ భావిస్తున్నారంట. ఈ క్రమంలోనే పై రెండు నియోజకవర్గాల విషయంలో ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.

ఇదే క్రమంలో… తూర్పుగోదావరి జిల్లాల్లోని ఒక నియోజకవర్గంతోపాటు గతంలో చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతి నుంచి కూడా పోటీచేయాలని భావిస్తున్నారంట. పవన్ తిరుపతిలో పోటీ చేయటం ద్వారా సమీప నియోజకవర్గాల పైన ప్రభావం ఉంటుందని.. ఫలితంగా రాయలసీమలో కూడా వైసీపీకి ఎంతో కొంత నష్టం కలిగించొచ్చని అంచనా వేస్తున్నారట. దీంతో.. పిఠాపురం స్థానంలో… ప్రత్తిపాడు – తిరుపతి ఫైనల్ అవ్వొచ్చని అంటున్నారు. మరి తాను పోటీచేయబోయే నియోజకవర్గాలపై పవన్ ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారనేది వేచి చూడాలి!