రెండింటికి చెడిన రేవడి చందంగా జన సేనాని పవన్ కళ్యాణ్

Power star Pawan Kalyan

Pawan Kalyan is not decisive on Amaravati as AP Capital. Pawan Kalyan has been wavering between Amaravati and BJP High Command.

అమరావతి రాజధాని సమస్య నేడు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పీకల మీదకు తెచ్చింది. నమ్మించి నట్టేట ముంచిన బిజెపితో చెలిమి కొన సాగించ లేరు. వెను వెంటనే బిజెపి రాం రాం చెప్పలేరు. బిజెపిని వదిలించుకొంటే ఈ రాష్ట్రంలో ఎవరూ పవన్ కళ్యాణ్ ను నమ్మే వారు లేరు. అట్లని రాజధాని రైతులకు ముఖం చూపలేరు. వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏ సుమూహూర్తాన రాజకీయ రంగ ప్రవేశం చేశారో గాని అప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ ఎదురు దెబ్బలే. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా వున్న నరేంద్ర మోడీని కలవడం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం తప్ప ఇప్పటి వరకు అన్నీ అపజయాలే ఎదురౌతున్నాయి. ఆ మాట కొస్తే ప్రజారాజ్యంలోనే ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. కేవలం తన సినిమా అభిమానులతోనే అధికారం చేపట్టవచ్చని భావించడంలోనే తప్పటడుగు వేశారు.

పిఎంవో ఆరా..3 రాజధానులకు బ్రేక్ అంటూ ప్రచారం 

ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినపుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత వుండినది. కొత్త నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూచారు. ఆదరించారు. ఆలాంటి ఆలోచనతోనే చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసి తుదకు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇన్ని అనుభవాలు వుండి పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ నెలకొల్పారంటే ఒకింత ఆశ్చర్యమే. పోనీ ఎన్నికల ముందు గాని తర్వాత గాని పూర్తి కాలం రాజకీయ నేతగా వుండ లేదు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టక పోవడంతో 2019 ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఓటమి చవిచూడవలసి వచ్చింది.రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఎన్నికల ముందు వామపక్షాలతో చెలిమి చేసి తరిమెల నాగిరెడ్డి చేగువేరా ఆదర్శ ప్రాయులుగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపితో చెలిమి మొదలు పెట్టారు. సునిశితంగా పరిశీలించితే పవన్ కళ్యాణ్ లో ఒక స్థిరత్వం రాజకీయ సంకల్పం వున్నట్లు కన్పించదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనూహ్యమైన మలుపులు తిరిగినపుడల్లా పవన్ కళ్యాణ్ కూడా ఆ మూల నుండి ఈ మూలకు నెట్ట బడుతున్నాడు.

బీజేపీకి ఒరిగేదేమీ లేదు కాబట్టే 3 రాజధానుల్ని అడ్డుకోలేదు 

తాజాగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మొత్తంగా అమరావతి చుట్టూ సుడులు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకు బిజెపి జాతీయ పెద్దల వద్ద అమరావతి రాజధాని అనే హామీ తీసుకొని వారితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. పాపం అమరావతి రైతులు నమ్మారు. నమ్మి నాన బోస్తే పుచ్చి బుర్రలైనట్లయింది అమరావతి రైతుల పరిస్థితి. బిజెపి అధ్యక్ష పదవి నుండి తొలగించ బడిన కన్నా లక్ష్మీనారాయణతో కలసి అమరావతి కోసం ఉద్యమం చేపట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తీరా పరిస్థితి తారు మారైంది. సోము వీర్రాజు కొత్త అధ్యక్షులుగా వచ్చారు. గవర్నర్ తన వద్ద వున్న బిల్లులు ఆమోదించారు. తొలి రోజు ఒక మాట చెప్పిన సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి మరో రకంగా మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బిజెపి పుంజుకొనేది లేదు. పోగొట్టుకోవడానికి ఏమీ మిగిలి లేదు. కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి ఎవరో కొందరు తమ అవసరాల కోసం బిజెపిలో వుంటారు.

అమరావతి కేంద్రంగా టి రాజకీయాలు… హైదరాబాద్ అంటే అంత భయమా ?

మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి రెండింటికి చెడిన రేవడి చందమైంది. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగానూ దీనికి తోడు అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలంటే బిజెపితో తెగదెంపులు చేసుకోవాలి. రాజధాని రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలి. ఇక బిజెపి అమరావతి కోసం పోరాడే అవకాశం లేదు. కేంద్రం నుండి సమాచారం వచ్చిన తర్వాతనే గవర్నర్ బిల్లులను ఆమోదించారనేది అందరికి తెలిసిందే.

రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు తొలి నుండి తాము తీసుకున్న వైఖరికి కట్టుబడి వున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు బిజెపితో కలసి కార్యాచరణ సాగిస్తామని చెబుతూ వుండి ఇప్పుడు ప్రధానంగా అమరావతి రైతులకు ఏమని సమాధానం చెప్పాలనో ఇబ్బందికర పరిస్థితి తప్పడం లేదు. అందుకే మొన్న పవన్ కళ్యాణ్ పాము చావ కుండా కర్ర విరగకుండా మాట్లాడారు. గమనార్హమైన అంశమేమంటే గతంలో అమరావతి రాజధానిని గట్టిగా సమర్థించినందున రాయలసీమలో పవన్ కళ్యాణ్ శవ యాత్రలు చేసిన సందర్భాలున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ మధ్యలో బిజెపి పుట్టి ముంచడంతో ఎటూ కాని స్థితిలో ఉన్నారు.

వి. శంకరయ్య 9848394013

విశ్రాంత పాత్రికేయులు