సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఇకపై రాజకీయాలకే పరిమితం. సినిమాల్ని వదిలేస్తున్నా..’ అని గతంలో చెప్పారు. కానీ, మాటకు కట్టుబడి వుండలేకపోయారు. సరే, సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు చేయకూడదని కాదు. రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాలు చేయకూడదనీ రూల్ లేదు. కానీ, తాను చెప్పిన మాటల్నే ఆయన పాటించలేకపోయారు. అదే అసలు సమస్య. ‘నువ్వు చెప్పిన మాటే కదా.?’ అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ఆయనకు కోపమొస్తుంది. ఈ వైఖరి కారణంగానే, పవన్ కళ్యాణ్‌కి దూరమయ్యారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. లేదంటే, జనసేనలో ఇప్పటికీ లక్ష్మినారాయణ కీలక నేతగా వుండేవారు.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, రెండు సినిమాల్ని తాజాగా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందులో ఒకటి సుజీత్‌తో తాజాగా అనౌన్స్ అయిన కొత్త సినిమా. మరొకకటి చాన్నాళ్ళ క్రితం ప్రకటితమైన ‘భవదీయుడు భగత్‌సింగ్’. ఇప్పుడైతే ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ మీద వుంది. 2024 ఎన్నికలంటే ఎంతో దూరం లేదు. మరి, ఈలోగా పవన్ కళ్యాణ్ పైన పేర్కొన్న మూడు సినిమాల్ని ఎలా పూర్తి చేయగలరు.? 2023 సంక్రాంతి తర్వాత జనంలో వుంటానని కొన్నాళ్ళ క్రితమే జనసేనాని ప్రకటించారు. అదెలా సాధ్యం.?
పైగా, పైన పేర్కొన్న మూడు సినిమాలూ స్ట్రెయిట్ సినిమాలు. భారీ బడ్జెట్ సినిమాలు. నిర్మాణం కోసం ఎక్కువ సమయం తీసుకుంటాయ్. ‘హరిహర వీరమల్లు’ ఇంకా పూర్తి కాలేదు. ఈలోగా ఇంకో రెండు కొత్త సినిమాల షూటింగులు షురూ అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సమయమెలా కేటాయించగలరు.? పవర్ స్టార్ అభిమానులైతే ఖుషీ అవుతున్నారు. కానీ, జనసైనికులే కొంత ఆందోళన చెందుతున్నారు.