మస్ట్ రీడ్: హీరోగా 9.4% … లాజిక్ మిస్ అవుతున్న పవన్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి రాజకీయంగా పరిపక్వత శూన్యం అని అంటుంటారు విశ్లేషకులు! ఏ విషయం బహిరంగంగా మాట్లాడాలి.. ఏ విషయం అంతర్గత సమావేశాల్లో వితౌట్ కెమెరాస్ మాట్లాడాలి అనే పరిజ్ఞానం అస్సలు లేదని అంటుంటారు! ఆ వ్యాఖ్యలను బలపరుస్తూ… పవన్ ఎన్నోసార్లు నిరూపించుకున్నారు! ఆ సంగతి అలా ఉంటే… పవన్ కల్యాణ్ రాజకీయాల్లో హీరోగా ఉంటే ఫలితాలు ఎలా వచ్చాయి.. ఇప్పుడు సైడ్ యాక్టర్ గా ఉంటే ఎలా రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం!

ఎవరు అవునన్నా కాదన్నా.. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. పవన్ కల్యాణ్ ని హీరోగా మాత్రమే చూడటానికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఒప్పుకుంటారు.. అది సినిమాల్లో అయినా – ఎన్నికల పోరాటంలో అయినా. అలా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, అయినదానికీ కానిదానికీ హీరోని పొగిడే ఫ్రెండ్ పాత్రలోనో, విలన్ పక్కన భజనచేసే కమెడియన్ పాత్రలోనో తమ స్టార్ ని వారు ఊహించుకోలేరు. కానీ… ప్రస్తుతం “హీరోగా నా వల్ల కాదు… చంద్రబాబు పక్కన సైడ్ క్యారెక్టర్ చేస్తాను” అని ప్రకటించేశారు పవన్ కల్యాణ్!

ఇది ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్న కొంతమంది జనసైనికులు.. “మాజీ”లుగా మారిపోతే.. మరికొంతమంది కష్టమో సుఖమో అన్నట్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఇంకొంతమంది మాత్రం వాస్తవాలను పవన్ దృష్టికి తీసుకెళ్లే పనికి పూనుకుంటున్నారు. అందులో భాగంగా… సినిమాలైనా రాజకీయాలైనా హీరోకీ క్యారెక్టర్ అర్టిస్టికీ ఉన్న తేడాను పవన్ కు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు (మాజీ)జనసైనికులు!

పవన్ హీరోగా ఉన్నప్పుడు… అంటే, జనసేన నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు… జనసేనకు రాయలసీమలో వచ్చిన ఓట్లు 2%.. కోస్తాలో 7.2%! పోని విభజించి చూస్తే… విశాఖపట్టణం జిల్లాలో జనసేనకు వచ్చిన ఓట్లు 8.6%. జిల్లాల వారీగా ఉన్న అసెంబ్లీ సీట్ల ప్రాతిపదికన చూస్తే… ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో 13.3%, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 స్థానాల్లో 5.6%. అంటే మొత్తం 67 సీట్లలో సగటున 9.4% ఓట్లు వచ్చాయన్న మాట.

అయితే తాజాగా మైకందుకున్న పవన్… కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు సరాసరిన జనసేనకు 25% ఓట్లు ఉన్నాయని.. అంతలా పెరిగాయని చెబుతున్నారు. తమకు బలం ఉన్న మరికొన్ని చోట్ల 30 శాతం కూడా అయ్యిందన్నారు. ఈ జిల్లాలలో 2019లో వారికి వచ్చిన ఓట్లు 9.1%. ఇవి ఈ నాలుగేళ్లలో దాదాపు మూడు రెట్లు వరకూ పెరిగిందని పవన్ చెప్పుకొస్తున్నారు! దీంతో… పవన్ హీరో (సీఎం) అవుతాడని ఆశ పెట్టుకున్నపుడే అన్ని వస్తే… కారెక్టర్ ఆర్టిస్ట్ (ఇంకా క్యారెక్టర్ పై క్లారిటీ లేదు) వేస్తానంటే ఓట్లు పెరుగుతాయా? పెరిగితే మూడు రెట్లు పెరుగుతాయా? అంటే పవన్ ని ఇష్టపడేవారు ఆయన్ని సీఎంగా చూడటం కంటే… ఎమ్మెల్యేగా చూస్తే సరిపోద్దని భావిస్తున్నారా? లాజిక్ మిస్.!!