పవన్ కళ్యాణ్‌కి ‘భీమ్లానాయక్’ నొప్పి ఇంకా తగ్గినట్టు లేదే.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన సినిమా ‘భీమ్లానాయక్’కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన ఆటంకాల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నట్టున్నారు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుం కోషియం’ను తెలుగులోకి ‘భీమ్లానాయక్’ పేరుతో విడుదల చేసిన విషయం విదితమే.
సినిమా మంచి విజయాన్ని అందుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల వసూళ్ళ పరంగా చాలా ఇబ్బంది పడింది. దానికి కారణం, ‘భీమ్లానాయక్’ సినిమాని ‘తొక్కేసేందుకు’ అధికార వైసీపీ, అడ్డగోలుగా అధికార యంత్రాంగాన్ని వినియోగించడమేనన్నది బహిరంగ రహస్యం.
తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో థియేటర్లలో పోలీసుల్ని మోహరించారు. థియేటర్ల వద్ద పోలీసుల కాపలా. సమోసా కంటే తక్కువ ధరకి సినిమా టిక్కెట్లు.. వెరసి, తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర అలజడి రేపింది ‘బీమ్లానాయక్’ వర్సెస్ ఏపీ సర్కారు రగడ.
ఆ విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ ఇంకోసారి గుర్తు చేసుకున్నారు. ‘వ్యవస్థల్ని ఓ సినిమాని నాశనం చేయడం కోసం వినియోగించిన వైఎస్ జగన్ సర్కారు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వడంలో ఎందుకు అధికార యంత్రాంగాన్ని మోహరించడంలేదు..’ అని పవన్ కళ్యాణ్ తాజాగా ప్రశ్నించారు.
‘ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ విషయంలో అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వాడండి.. మరో విషయంలో సమర్థులుగా వ్యవహరించండి.. అంతేగానీ, సినిమాల మీద మీ ప్రతాపమా.?’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘మేం అధికారంలోకి వస్తే, సమర్థతకు పెద్ద పీఠ వేస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
‘రాజ్యంగం మనకి అన్నీ ఇచ్చింది.. కొత్తగా చెయ్యాల్సిందేమీ లేదు.. రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరిస్తే చాలు. వైసీపీ పాలనలో అసలు రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది..’ అని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు.