ఈ ఒక్క ఫొటోతో పవన్ మొత్తం అందరికీ సమాధానం

పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో పోటీ చేసిన రెండు స్థానాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన తిరిగి వెనక్కి వచ్చి సినిమాల్లో పాల్గొంటారంటూ ఓ వర్గం ప్రచారం చేస్తోంది. అప్పటికీ పవన్ ఆ కామెంట్స్ ని కొట్టి పారేసేలా తన భవిష్యత్ రాజకీయంతో ముడిపడి ఉందని తేల్చాడు.

అంతేకాకుండా కొత్త రాజకీయ పార్టీ కాబట్టి గెలుపోటములు సహజం అనే రీతిలో భవిష్యత్ ప్రణాళికల కోసం తన టీమ్ తో రెగ్యులర్ గా చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ పవన్ మళ్ళీ సినిమాలు చేస్తాడని త్వరలోనే ప్రకటనలు వస్తాయని ఇలా రకరకాలుగా మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగటం మాత్రం ఆగలేదు. ఈ నేపధ్యంలో పవన్ లేటెస్ట్ లుక్ కు సంభందించిన ఫొటోలు రిలీజ్ అయ్యాయి. ఈ కొత్త ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

పవన్ గత కొన్ని రోజుల క్రితం వరకు రాజకీయ నాయకుడిగా తెల్లటి లాల్చీ పైజమాలో కనిపించారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత పవన్‌ తొలిసారి కలర్ ఫుల్ డ్రెస్ లో కనపడ్డారు. ఆయన నీలి రంగు టీ షర్ట్‌, జీన్స్‌ ధరించి ఉన్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా రోజుల తర్వాత పవర్‌స్టార్‌ను అలా చూడటంతో అభిమానులు ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. అయితే ఆయన గడ్డాన్ని మాత్రం తీయకుండా అలానే ఉంచేసారు. దాంతో అభిమానులు ఈ ఫొటోలు షేర్ చేస్తూ.. పవన్ ఒకవేళ ఇప్పటికిప్పుడు సినిమాలు చేసే ఉద్దేశంలో ఉంటె గెడ్డం తీయడంతో పాటు లుక్ లో చేంజ్ చూపించేవాడు అంటున్నారు. అదీ నిజమే కదా.

ఇక జనసేనకు 2019 ఎన్నికల్లో తీవ్ర నిరాశ మిగిలింది. పవన్‌ పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయారు. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు గాజువాకలోనూ వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్‌ ఓడిపోయారు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం ఒక్క సీటు దక్కింది.