పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో మార్పు మొదలైనట్లు అర్థమవుతోందని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామాల్లో జనసేన పార్టీ బలంగా ఉందని గణాంకాలే చెబుతున్నాయని పవన్ అన్నారు. జనసేన మద్ధతుదారుల గెలుపుతోనే మార్పు మొదలైందని.. అధికార పార్టీ ఒత్తిళ్లు.. బెదిరింపులను తట్టుకొని పార్టీ మద్ధతుదారులు నిలిచారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా ఉందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాల గణంకాలే రుజువు చేస్తున్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోద్బలంతో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.. పల్లెల్లోని ప్రజలను బెదిరించి ఏకగ్రీవాలు చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య పోటీ జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని పవన్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం జనసేన బలంగా పోరాటం చేస్తుందని.. జనసైనికులే అధికార పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న అధికార పార్టీ జనసేన పార్టీని చూసి భయపడుతోందని కామెంట్ చేశారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించిందని పవన్ అన్నారు. తొలి విడతలో జనసేనకు 18శాతం ఓట్లు వస్తే.. రెండో విడతలో 22శాతం ఓట్లు వచ్చాయన్నారు. 250కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారని… 1500 పంచాయతీల్లో రెండోస్థానం వచ్చిందన్నారు. 1500 వార్డులు తమ పార్టీ ఖాతాలో చేరినట్లు పవన్ వెల్లడించారు.
సాధారణంగా పంచాయతీ ఎన్నికలంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయని.. అలాంటి పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పోరాటం చేశారని చెప్పారు. ప్రజా సమస్యలపై జనసేన నిరంతరం పోరాడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తొలి రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని మలిదశలోనూ చూపించాలని పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు.