జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి స్పష్టత వచ్చింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలలో వెల్లడైన నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై పవన్ దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. జనసేన కార్యాలయం నుంచి ఇప్పటికే ఈ మేరకు లీకులు అందుతున్నాయి.
త్వరలో పవన్ కళ్యాణ్ తను పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నారు. గాజువాక, భీమవరంలలో పోటీ చేసినా అనుకూల ఫలితాలు రావడం కష్టమని తేలడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైనా ఈ నియోజకవర్గంలో పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండటంతో పాటు పవన్ ను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. జనసేన టీడీపీ కూటమి 2024లో అధికారంలోకి వస్తే రెండున్నర సంవత్సరాల పాటు పవన్ సీఎంగా ఉండనున్నారని బోగట్టా. ఎమ్మెల్యేగా కచ్చితంగా గెలిచి ఏపీకి సీఎం కావాలనే కోరికను నెరవేర్చుకోవాలని పవన్ భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీలతో పొత్తు లేకుండా పోటీ చేయడం జనసేనకు కూడా ప్లస్ కాదు. ఈ కారణాల వల్ల టీడీపీతో పొత్తుకు జనసేనాని ఆసక్తి చూపుతున్నారు. వైసీపీ నేతలు పదేపదే తనపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి విమర్శలకు చెక్ పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.