ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఒక్క అనకాపల్లి మినహా అన్ని నియోజకవర్గాలకూ ఎన్నికల షెడ్యూల్ సమయంలోనే ప్రకటించారు. అనంతరం ఇటీవల ఆ పనికూడా పూర్తి చేశారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొత్తులో భాగంగా తమకు కేటాయించబడిన 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బీజేపీ కూడా 10+6 స్థానాలను ప్రకటించేసింది. అయితే జనసేనాని మాత్రం ఉన్న 21 అసెంబ్లీ స్థానలకూ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు!
అవును… ఉన్న 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలకు గానూ ఇప్పటివరకూ 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇంకా మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో… ఇంకెంతకాలం ఈ నాన్చుడు ధోరణి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఉన్న రెండు ఎంపీ స్థానాల్లోనూ కాకినాడపై క్లారిటీ ఇచ్చిన పవన్.. మచిలీపట్నాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు! ఇక్కడ బాలశౌరి, వంగవీటి రాధా ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో అవనిగడ్డ అసెంబ్లీ టిక్కెట్ విషయంలోనూ జనసేనలో డైలామా కొనసాగుతోంది. అక్కడ నుంచి బాలశౌరి, వంగవీటిల్లో ఎవరికి కెటాయిస్తారనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న రెండు కీలక స్థానాలూ జనసేనాని కన్ ఫర్మేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో భాగంగా… విశాఖ సౌత్, పాలకొండ ఎస్టీ సీటుకు ఎవరు జనసేన అభ్యర్థులు అనే చర్చ తెరపైకి వచ్చింది.
వాస్తవానికి విశాఖ సౌత్ నుంచి ఇప్పటికే జనసేన తరుపున.. వైసీపీ నుంచి వచ్చి చేరిన వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు. అయితే ఆయన నాన్ లోకల్ అభ్యర్థి అనే చర్చ తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. మరోపక్క పాలకొండ కు జనసేనలో అభ్యర్థి లేరని… టీడీపీ నుంచి జనసేనలో చేర్చుకుని, ఆ టిక్కెట్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా… ఇక్కడ నుంచి రెండు సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన నిమ్మక జయకృష్ణకు జనసేన కండువా కప్పి టిక్కెట్ కన్ ఫాం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
అయితే.. ఈ ఆలస్యానికి బీజేపీ కూడా ఒక కారణం అని అంటున్నారు. తమకు 11వ అసెంబ్లీ సీటు కూడా కావాలని బీజేపీ పెద్దలు అడుగుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కూడా ఇప్పుడు కూటమికి పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. ఈ సమయంలో… ఆ రెండు విషయాలపైనా క్లారిటీ వచ్చిన తర్వాతే… జనసేన ఫైనల్ ప్రకటన ఉండొచ్చనేది ఇప్పుడు ప్రధాన అంశంగా ఉంది.
దీంతో… 175 లోనూ 21 స్థానాలు కేటాయిస్తేనే పవన్ కల్యాణ్ ఇలా కిందా మీదా పడిపోతుంటే… జోగయ్య కోరినట్లు, జనసైనికులు భావించినట్లు 40 సీట్లవరకూ జనసేనకు కేటాయించి ఉంటే… పవన్ కి ఇంకెంత కష్టం వచ్చి ఉండేదో అనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం. తన పార్టీ బలా బలాలు తెలిసే.. పవన్ కల్యాణ్ 21 కి ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా… జనసేన ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందనేది సేనాని చేతుల్లో కూడా లేదనేది ఇప్పుడు కీలకమైన అంశంగా ఉంది!