పాలిటిక్స్ లో పవన్ సీరియస్ నెస్ కి ఇదే తాజా సాక్ష్యం!

మైకందుకుంటే ఇటీవల పవన్ చేస్తున్న ప్రసంగాలకూ.. ప్రాక్టికల్ గా వచ్చేసరికి చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతనలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజల కోసం, ప్రజలకు మేలు జరగడం కోసం, రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంతదూరం అయినా వెళ్తాను అని చెప్పే పవన్… హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదని గుంటూరు నుంచి భీమవరం రాలేక.. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అవును… ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అత్యంత రసవత్తర రాజకీయానికి తెరలేచిన వేళ… జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన ఏపీ పర్యటన వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి ఆయన ఏపీలో విస్తృతంగా పర్యటించాల్సి ఉండగా.. ఒక్క రోజు ముందు దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. వాయిదా వేయడం తప్పుకాకపోవచ్చు కానీ… అందుకు వారు చెప్పిన కారణం మరీ సిల్లిగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో పవన్ పోటీచేసిన స్థానాల్లో ఎక్కువ ఆశలుపెట్టుకున్నారని చెప్పే భీమవరంలోనూ ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో ఈస్ట్, వెస్ట్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమిని పాలముంచినా, నీటముంచినా ఉభయగోదావరి ఉమ్మడి జిల్లాలే అని బలంగా నమ్ముతున్నారు. దీంతో… అక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలనుకున్నారు.

ఇందులో భాగంగా… నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. పవన్ కల్యాణ్ ఈ నెల 14వ (బుధవారం) నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్‌ ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా… మొదటిగ భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. దీని కోసం హెలికాప్టర్‌ ను సిద్ధం చేసుకున్నారు.

అయితే… ఇంతలోనే చివరి నిమిషంలో భీమవరం పర్యటన వాయిదా పడింది. కారణం ఏమిటంటే… హెలికాప్టర్ ల్యాండింగ్‌ కు అధికారులు అనుమతించట్లేదని అంట! అందువల్లే పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. అనంతరం… హెలికాప్టర్ ల్యాండింగ్‌ కు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించింది.. అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లను తెచ్చిందని విమర్శించింది.

అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దీంతో… హెలికాప్టర్ ల్యాండింగ్‌ కు అనుమతి ఇవ్వట్లేదనే కారణంతో పర్యటన వాయిదా వేసుకోవడం పట్ల అటు జనసేన పార్టీ శ్రేణులు సైతం నిరుత్సాహానికి గురవుతున్నాయి. హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోతే కార్లలోనో, వారాహి వాహనంమీదో వచ్చేయాలి.. అనుమతి ఇవ్వని విషయాన్ని ప్రజలకు చెప్పుకోవాలి.. అంతే కానీ… హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదని ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతారా.. శ్రేణులను నిరాసకు గురిత్చేస్తారా?

రేపు అభ్యర్థులను బెదిరిస్తున్నారని పోటీనుంచి తప్పుకుంటారా? చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన సమయంలో రోడ్డు మార్గంలో రాలేదా? ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగారా? రోడ్లపై పడుకుని మరీ రాజమండ్రి చేరుకున్నారు!! మరి ఆ కమిట్ మెంట్ ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో ఏమైంది.. ఇక్కడే పాలిటిక్స్ లో పవన్ కల్యాణ్ సీరియస్ నెస్ అర్ధమైపోతుందని అంటున్నారు పరిశీలకులు!