కులప్రస్థావన లేకుండా పట్టుమని పదినిమిషాలు కూడా ప్రసంగించలేరని పవన్ పై ఒక విమర్శ ఉంది. ఆ విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం పవన్ ఏనాడూ చేయలేదు. సరికదా… ఆ విమర్శకు మరింత బలాన్నిచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితంగా అపరిపక్వత కలిగిన నాయకుడిగా మిగిలిపోతున్నారు! అయినా పర్లేదు… ఈసారి ఆ కుల ప్రస్థావన చేసినా సరే… ఆ సామాజికవర్గంలో రెండు భాగాలుగా విడిపోయిన వారికి మాత్రం స్పష్టత ఇచ్చి తీరాలని అంటున్నారు విశ్లేషకులు!
విషయంలోకి వస్తే… పవన్ సామాజికవర్గానికి సంబందించి ఏపీలో రెండు రకాల కాపులు ఉన్నారు. వారిలో… పవన్ పేరు చెబితే పూనకాలు లోడింగ్ అయ్యే కాపు ఒకరు. గత ఎన్నికల్లో పవన్ కి ఓటు వేయని కాపు ఇంకొకరు! అంటే.. పవన్ ని గుడ్డిగా నమ్మే కాపు ఒకరు. తమను నమ్మించే పని పవన్ ఎప్పుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న కాపు ఇంకొకరు! వీరిద్దరినీ సమన్వయ పరచడంలో సక్సెస్ ఫుల్ గా ఫెయిల్ అవుతూ వస్తున్న పవన్… మరోసారి అదేస్థాయిలో డిస్టింక్షన్ లో ఫెయిల్ అయ్యారు!
కాపు సామాజికవర్గ ప్రజలతో మీటింగ్ పెట్టిన ప్రతీసారీ… పవన్ ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు. ఎందుకంటే.. పవన్ ఏమి చేసినా కరెక్టే అనే కాపు మాత్రమే ఆ సభల్లో మెజారిటీ సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో ఓటు వెయ్యకపోయినా… పోనీ ఈసారైనా వేద్దాం అని రెండో కాపు ఆ సభకు వస్తే… గతంలో తాను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని ఫీలయ్యి వెళ్లిపోతుంటాడు! ఎందుకంటే… మళ్లీ అదే రొట్ట కొట్టుడు. “నవ్వు తప్పించని జోకులు – చికాకు తెప్పించే స్టేట్ మెంట్ లు – చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పలేని మాటలు – పొలిటికల్ విషయాలపై ఫ్లో లేని ప్రసంగాలు… వెరసి స్పష్టత లేని రాజకీయాలు!”
దీంతో… ఇంతకూ ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమిటా? అని పవన్ పెద్దగా బుర్ర పాడుచేసుకుంటూ ఆలోచించాల్సిన అవసరం లేదు. తాను చదివినట్లు చెప్పుకునే లక్ష పుస్తకాలను రివిజన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. జస్ట్… “తనను ఒక సామాజికవర్గం భుజాన్న మోయడానికి సిద్ధంగా ఉంది. ఆ సామాజికవర్గానికి రాజ్యాధికారం తెచ్చిపెట్టడానికి తన నిజాయితీగల కృషిని ఆశిస్తుంది..” అని గ్రహిస్తే చాలు. కానీ పవన్ మాత్రం… తన వ్యక్తిగత కారణాలతోనో, ఆర్థిక సంబంధాల కొనసాగింపులో భాగంగానో… కారణం ఏదైనా… ఆ సామాజికవర్గంలోని రెండో కాపు నిజమైన బాదను అర్థం చేసుకోలేకపోతున్నారు. మొదటి కాపుకేమో అంత ఆలోచనా శక్తి లేదాయే!
సో… ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం వచ్చింది. పదవ ఆవిర్భావ సభ వేదికగా పవన్ ఈ విషయాలు వెళ్లడించాలి. ఇంతకు మించిన మరో బలమైన వేదిక, గొప్ప అవకాశం మళ్లీ రాకపోవచ్చు. లోపాయకారీ ఒప్పందాల విషయంలో రెండో కాపుకి పవన్ కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి.. నమ్మించాలి.. మాటలతో కాకుండా చేతలలో వారికి నమ్మకం కలిగించాలి. అది సక్సెస్ ఫుల్ గా చేయగలిగితే చాలు… పవన్ సక్సెస్ అయినట్లే. అది ఎంత బలంగా చేస్తారనే దానిపై పవన్ సక్సెస్ అంత బలంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇక అలవాటు పడిన ఈలలూ గోలలకు సభలో ఏమీ కొదవ ఉండదు. సభలో ప్రసంగం మధ్యలో జుట్టు పైకి ఎగరేసినప్పుడు – అసభ్య పదజాలం వాడినప్పుడు – అసందర్భంగా జోకులు వేసినప్పుడూ – అవసరంలేని ఆవేశంతో ఊగిపోయినప్పుడు .. ఈలలు వేస్తూ గోల చేయడానికి ఇక మొదటి కాపు ఎలానూ ఉండనే ఉన్నాడు. సో… ఈ సభ జనసమీకరణ విషయంలో కచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ… రెండో కాపుని ఒప్పించే విషయంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు… ఆ రెండో కాపు నాయకులు!