పవన్‌ కొత్త పల్లవి… భయపడ్డాడో…?

పవన్ కల్యాణ్ తాను చేసిన పనికి రియాక్షన్ గట్టిగా వస్తే.. వెంటనే వెనక్కి తగ్గుతారని, అనంతరం మాట మార్చి ప్రవచనాలు వళ్లిస్తారని అంటుంటారు. దీనికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని చెబుతుంటారు. ఈ క్రమ్మలో తాజాగా రాజకీయాల్లో సినిమా అనే టాపిక్ పై తనదైన శైలిలో స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

అవును… పవన్‌ కళ్యాణ్‌ తాజాగా నటించిన “బ్రో” సినిమా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన పలు సంచలన ఆరోపణలపై స్పందించని సంగతి తెలిసిందే. ఇలా స్పందించకపోగా… తాజాగా ఇక నుంచి పార్టీ నేతలెవ్వరూ సినిమాల గురించి మాట్లాడ కండంటూ హుకుం జారీ చేశారు. దీంతో… రాజకీయాల్లో సినిమా ప్రస్తావనలొద్దని చెప్పడం వెనుక కారణం ఏంటనే చర్చలు మొదలైపోయాయి.

సాధారణంగా తాను నటించిన సినిమాలోని పా త్రలను ఉటంకిస్తూ మాట్లాడటం పవన్ కు పరిపాటి. తన రాజకీయ ప్రసంగాల్లో ఎక్కువగా సినిమా విషయాలే ప్రస్తావిస్తూ ఉంటారు ఆయన. అలాంటిది.. హఠాత్తుగా “సినిమాలను రాజకీయాల్లోకి తీసుకురావొద్దు” అంటూ జనసేన నేతలకు బహిరంగంగా స్పష్టమైన సూచనలు చేశారు పవన్.

దీంతో… మంత్రి అంబటి లేవనెత్తిన అంశాలపై తనతోపాటు పార్టీ నాయకులు సైతం మాట్లాడకుండా ఉండడం కోసమే స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో… ఈ విధంగా తమ నోళ్లను కూడా మూయించారని జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోందని తెలుస్తోంది.

కాగా… వారాహి యాత్ర తొలివిడతలో భాగంగా ముద్రగడపై చేసిన ఆరోపణల విషయంలో కూడా పవన్ ఇలానే జంకిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… కాకినాడ, అమలాపురం సభల్లో కాపు ఉద్యమనేత ముద్రగడపై.. పేరెత్తకుండా అవాకులూ చెవాకులూ పేలిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో ముద్రగడ నుంచి పవన్ పైకి లేఖాస్త్రాలు వచ్చి పడ్డాయి. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కాపు నాయకులు పవన్ పై ఫైరయ్యారు.. ముద్రగడకు అనుకూలంగా మాట్లాడారు. దీతో భయపడ్డారో ఏమో కానీ… రాజోలు సభలో ముద్రగడ ఫోటో చూడగానే పవన్ జంకారు. పెద్దలు అన్న తర్వాత మనల్ని నాలుగు మాటలు అంటారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

దీంతో… ముందు ఆఫ్ నాలెడ్జ్ తోనో, సినిమాల ప్రభావంతోనో నోరు జారడం.. ఆనాక నాలుక కరుచుకుని సన్నాయి నొక్కులు నొక్కడం.. పవన్ కు పరిపాటే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.