కొత్త చర్చ… షర్మిల కారణంగా పవన్ – జగన్ లకు షాకులు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇందులో భాగంగా నిన్నటివరకూ ద్విముఖ పోరు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ అనుకూల ఓటు మధ్యే పోరు అని భావించిన నేపథ్యంలో… త్రిముఖ పోటీకి తెరతీస్తూ ఏపీలో షర్మిల అడుగు పెట్టింది. పీసీసీ చీఫ్ గా పదవీ బాద్యతలు తీసుకున్న అనంతరం చేసిన తొలి ప్రసంగంలో… అటు చంద్రబాబుని, ఇటు జగన్ ని విమర్శించారు. ఫలితంగా తాను మూడో ప్రత్యామ్నాయం అనే సంకేతాలు పంపారు.

పీసీసీ చీఫ్ గా తొలి ప్రసంగం చేసిన షర్మిల… అటు గత ఐదేళ్లలో చంద్రబాబు కానీ, ఇటు ఈ నాలుగున్నరేళ్లలో జగన్ కానీ ఏపీలో ఎలాంటి అభివృద్ధీ చేయలేదని అన్నారు. వీరంతా బీజేపీ బ్యాచ్చే అని క్లారిటీ ఇచ్చారు. వీరందరికీ తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఏపీలో షర్మిళ రాకతో అటు జగన్ కు ఇటు పవన్ కు కూడా షాకులు తప్పకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. పవన్ కి అంటే టీడీపీ – జనసేనకు ఉమ్మడిగా అని!!

ఈ విషయంలో ముందుగా జగన్ విషయానికొస్తే… ఏపీలో జగన్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లతోపాటు బీసీలో కొంత శాతం ఉందనేది తెలిసిన విషయమే! ఈ నాలుగున్నరేళ్ల పాలనతో మహిళల్లో కూడా జగన్ కు ఒక సెట్ ఆఫ్ ఓటు బ్యాంక్ వచ్చిందని చెబుతున్నారు. అయితే… షర్మిల ఎంట్రీ ఇవ్వడం వల్ల వైసీపీలో టిక్కెట్ దక్కనివారు అటువైపు చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే హస్తం గూటికి చేరిపోయారు.

ఇదే సమయంలో మరికొంతమంది క్యూలో ఉన్నారని అంటున్నారు. దీంతో… వీరి రూపంలో జగన్ కు సమస్యలు తప్పకపోవచ్చని అంటున్నారు. అయితే… క్రీస్టియన్ ఓటు బ్యాంక్ ను మాత్రం షర్మిళ చీల్చే అవకాశం ఉండకపోవచ్చని.. జగన్ ను వారు వీడే ప్రసక్తి ఆల్ మోస్ట్ అసాధ్యమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే… వైసీపీ రెబల్స్ ని తమతో చేర్చుకోవడం వల్ల.. ఫైనల్ గా కొన్ని స్థానాల్లో వైసీపీకి దెబ్బ అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇక షర్మిల రాకవల్ల పవన్ & కో కి వచ్చే సమస్య కాస్త బలంగానే ఉందనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో మొదలైపోయాయి. కారణం… రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అసలు టీడీపీతో జతకట్టడానికి కారణమే అదని చెప్పుకున్నారు. ఇదే సమయంలో బీజేపీని కూడా తమతో కలవమని పవన్ అడుగుతున్నారు. ఈ సమయంలో అయితే సడన్ గా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు.

దీంతో ఇంతకాలం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్న ఏపీ కాంగ్రెస్ లో కదలికలు వచ్చాయి. దీంతో వైసీపీలో టికెట్లు దక్కని అసంతృప్తుల్లో మెజారిటీ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం పుష్కలంగా ఉంది. అలాంటి వాళ్ళందరికీ కాంగ్రెస్ టికెట్లిస్తుంది కాబట్టి.. కొన్ని చోట్ల పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా… కేడర్ కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో బాబు & కో కి సమస్యే అని అంటున్నారు పరిశీలకులు.

సరిగ్గా గమనిస్తే… ఇన్ని రోజులూ అయితే జగన్, లేకపోతే పవన్ అన్నట్లుగా సాగిన వ్యవహారం కాస్తా… టీడీపీ – జనసేన కూటమితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పేరు కూడా తెరపైకి వస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ ఎంత యాక్టివ్ అయితే టీడీపీ, జనసేనకు అంతనష్టం అనే అనుకోవాలి. కారణం… ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. ఫలితంగా… 2019లో జరిగినట్లే జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు!!

ఏది ఏమైనా… ఏపీలో త్రిముఖ పోటీ తథ్యం అని అంటున్న వేళ ప్రభుత్వ వ్యతిరేక పార్టీల్లో ఎంత బలమైన చీలిక వస్తే వైసీపీకి అంత లాభం కాగా… కాంగ్రెస్ ఎన్ని ఓట్లు చీల్చుకుంటే పవన్, చంద్రబాబుకు అంత మైనస్. కాబట్టి షర్మిల షాక్ లు ఇద్దరికీ తప్పవనే అనుకోవాలి.. కాకపోతే అది ఏ రేంజిలో అనేది ఎన్నికల సమయానికి కాని తెలియదు!!