పగిలిన గ్లాసు….రెండు చోట్లా ఓడిపోయిన పవన్

మొత్తానికి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వాస్తవం ఏమిటో బోధపడినట్లే ఉంది. తన స్ధాయి ఏమిటి ? డబుల్ గేమ్ ఆడితే జనాలు కొర్రు కాచి వాతలు ఎలా పెడతారో అనుభవంలోకి వచ్చినట్లే ఉంది. మొత్తం మీద తానే కాబోయే సిఎం అని ఆమధ్య ఒకటే ఊదరగొట్టారు.  చివరకు జనాలు జనసేన మాడు పగలగొట్టి గ్లాసును బద్దలు కొట్టేశారు.

175 అసెంబ్లీ సీట్లలో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా జనసేనకు  ఇవ్వలేదు. ఒక్క సీటు కూడా అంటే పవన్ స్వయంగా పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు భీమవరం, గాజువాక కూడా కలుపుకునే లేండి. స్వయంగా పవనే ఓటమి అంచున కొట్టుకుంటుంటే ఇక మిగిలిన అభ్యర్ధుల గురించి చెప్పేదేముంది ?

మార్పు కోసమే రాజకీయాలన్నాడు. జనాలకు మంచి చేయాలంటే అధికారమే ఉండాలా అంటూ ప్రశ్నించాడు. అధికారంలోకి రావటం కోసమే తాను పార్టీ పెట్టలేదన్నాడు. చివరకు ఎన్నికలు దగ్గరకు వచ్చినపుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటూ పిలుపిచ్చాడు. అంటే అర్ధమేంటి ? అజ్ఞాత మిత్రుడు చంద్రబాబునాయుడును గెలిపించమన్నట్లుగా పరోక్షంగా సంకేతాలిచ్చాడు.

నిజంగా పవన్ గెలవటానికి పార్టీ పెట్టలేదన్నది మాత్రం వాస్తవమే. అదే సమయంలో చంద్రబాబును గెలిపించటానికే జనసేనను ఎన్నికల్లోకి దింపాడన్నదీ అంతే వాస్తవం. ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యిన దగ్గర నుండి చంద్రబాబును ఎలా గెలిపించాలి ? జగన్ ను ఎలా ఓడగొట్టాలి ? అన్న టార్గెట్ తోనే పవన్ రాజకీయాలు చేశారు.

ఈ విషయం జనాలు గమనించారు కాబట్టే జనసేన మాడు పగలగొట్టారు. భీమవరంలో పవన్ నే ఓడగొట్టారు. గాజువాకలో కూడా పవన్ ఓటమి అంచున ఉన్నారు. జగన్ కు వ్యతిరేకంగా డబుల్ గేమ్ ఆడిన చంద్రబాబు, పవన్ ఇద్దరిని కలిసి జనాలు చాప చుట్టినట్లు చుట్టేసి విసిరేశారు. ఫలితంగా అటు టిడిపి ఇటు జనసేన రెండు ఓడిపోయాయి.  సరే చంద్రబాబకు ఇబ్బందేమీ లేదు. మరి పవన్ ఏమి చేస్తారో చూడాలి.