చంద్రబాబునాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి షాకే ఇచ్చారు. కష్టాల్లో ఉన్నాను ఈ ఒక్కసారికి మద్దతిచ్చి సాయం చేయండన్న చంద్రబాబు వేడుకోలును పవన్ కొట్టిపారేశారు. కుప్పంలో చంద్రబాబు విజ్ఞప్తికి పవన్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ స్ధానాల్లోను సంపూర్ణంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వామపక్షాలతో తప్ప ఇంకే పార్టీతోను ఎన్నికల్లో కలిసి వెళ్ళేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పొత్తుల విషయంలో అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కూడా ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు లేండి.
జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళము. యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి – @PawanKalyan #JSPToContestIn175Constituencies
— JanaSena Party (@JanaSenaParty) January 3, 2019
పొత్తుల విషయంలో అధికార, ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దంటూ పవన్ విజ్ఞప్తి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ? తనపై జనాలకు నమ్మకం లేదనే కదా పవన్ చెబుతున్నదానికి అర్ధం. జనాలు నమ్మటం లేదంటే అందుకు తన వైఖరే కారణమని పవన్ గ్రహించాలి. మొదటి నుండి పవన్ అంటే చంద్రబాబునాయుడు జేబులోని మనిషే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పుడప్పుడు చంద్రబాబు, లోకేష్ లను పవన్ విమర్శిస్తున్నా, ఆరోపణలు చేస్తున్నా ఎవరూ నమ్మటం లేదు. పవన్ అంటే ప్యాకేజీల నేతే అన్న బలమైన ముద్ర పడిపోయింది. ఎందుకంటే, అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలిపెట్టి ప్రధాన ప్రతిపక్షమైన వైసిపిని పవన్ విమర్శించటమే ప్రధాన కారణం. ఒకవైపు తాను చంద్రబాబుకు కూడా వ్యతిరేకమని చెబుతూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసిపి చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు ప్యారలెల్ గా పవన్ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో పర్యటన కావచ్చు, కడప మెడికల్ కళాశాల విద్యార్ధులతో సమావేశం కావచ్చు, పోలవరం యాత్ర కావచ్చు. ఇలా ప్రతిదీ వైసిపికి పోటీగా కార్యక్రమాలు నిర్వహించటం వల్ల పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి బయటకు రాకుండా పవన్ అడ్డుకున్నట్లైంది. దానికితోడు అప్పుడప్పుడు చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అవటం కూడా పవన్ పై నమ్మకం పోయేలా చేసింది. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని పవన్ మొత్తుకుంటున్నా ఎవరూ నమ్మటం లేదు.