పవన్ కళ్యాణ్ కి మొదట్లోనే అనుకుంటే మధ్యలో కూడ క్లారిటీ లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఏవేవో నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయాలకు కొత్త కదా ఇలాగే ఉంటుంది. కాస్త రాటుదేలితే అన్ని తెలిసొస్తాయి అనుకున్నారు. కానీ 2014 ఎన్నికలు వెళ్లిపోయాయి, 2019 ఎలక్షన్లు ముగిశాయి దాదాపు పవన్ పొలిటికల్ జర్నీ సగానికి వచ్చేసింది. ఈ సగం ప్రయాణంలో ఆయన సాధించిన రాజకీయ విజయాలు ఏమీ లేవు. ఇన్నేళ్లు కష్టపడితే ఒక ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. అది కూడ ఆయన కాకపోవడం ఇంకో పెద్ద పరాభవం. అయినా ఆయనలో మార్పేమీ వచ్చినట్టు కనబడట్లేదు. ఇక ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునేది లేదన్న ఆయన చూస్తుండగానే వెళ్లి బీజేపీ చేయి పట్టుకున్నారు.
ఈ పొత్తు జనసేన కార్యకర్తలకు అస్సలు నచ్చలేదు. అయినా కూడ పవన్ ఏదైనా కొత్త పొలిటికల్ ప్లానింగ్ చేస్తున్నారేమో అనుకుని ఊరుకున్నారు. కానీ అక్కడ ప్లానింగ్ లాంటివేమీ లేవు. కేవలం సైలెన్స్ మాత్రమే రాజ్యమేలుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఇష్టంవచ్చినట్టు గేమ్స్ ఆడేస్తోంది. వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్రంలో బీజేపీ ఏమైపోయినా జనసేన కార్యకర్తలకు ఎలాంటి పట్టింపూ లేదు. కానీ వారితో పాటే ఉన్న పవన్ ఏమైపోతాడోననేదే వారి భయం. ప్రత్యేక హోదా విషయంలో నట్టేట ముంచిన బీజేపీ మూడు రాజధానుల విషయంలో కూడ జనసేన సిద్ధాంతానికి విరుద్దంగా వ్యవహరిస్తోంది. అదే జనసైనికులను అధికార వర్గం మీద నోరు మెదపనీయట్లేదు.
ఇక తాజాగా పోలవరం విషయంలో కూడ బీజేపీ వైఖరి ఆంధ్రుల ఆకాంక్షకు నిప్పు పెట్టేలా ఉంది. ఈ పద్దతి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో సీటు కాదు కదా ఒక్క ఓటు కూడ పడదు. ఆ సమయానికి వారితో ఎవరు ఉంటే వారు కూడ ఇందాక చెప్పుకున్నట్టు నట్టేట మునగాల్సిందే. అదే పవన్ అభిమానుల భయం. అయితే కొందరు కార్యకర్తలు మాత్రం పవన్ లోని ఒక గుణం మీద నమ్మకం పెట్టుకుని ధీమాగా ఉన్నారు. అవతిలివారు ఎంతటివారైనా, ఎంత ఒత్తిడి చేసినా, వారి వలన ఎన్ని ప్రయోజనాలున్నా సరే వదిలేయాలి అనుకుంటే మొహమాటం లేకుండా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే బెరుకు లేకుండా వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోవడం ఆయన స్టైల్. ఒక్కసారి బీజేపీతో ఉంటే వినాశనం ఖాయమని పవన్ నమ్మితే చిన్న ప్రెస్ నోట్ ద్వారా పొత్తుకు సెలవు అని బీజేపీ నెత్తిన ఆటంబాంబు వేయగలరు. అదే జరగాలని కోరుకుంటున్నారు ఆయన కార్యకర్తలు.