ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతనలేకపోవడంతో పాటు.. ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలను పరిగణలోకి తీసుకొన్న పలువురు పరిశీలకులు మాత్రం… చాలా విషయాల్లో గురువు చంద్రబాబుని మించిన శిష్యుడిగా పవన్ కల్యాణ్ అప్ డేట్ అవుతున్నారని.. బాబు మార్కు రాజకీయాలను అవపోసనపట్టినట్లుగా నడుచుకుంటున్నారని అంటున్నారు!
అవును… చెప్పిన మాటకు, చేసే పనికి అంతరం చూపించడంలో చంద్రబాబుకి నూటికి నూరు మార్కులు పడితే.. పవన్ కల్యాణ్ కి 101 వేసినా పర్లేదనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ… తాజాగా తెరపైకి వచ్చిన ఉదాహరణ మాత్రం.. వీరమహిళలతో పవన్ చెప్పిన మాటలు, చేసిన పనులు, తాజాగా చేతిలో పెట్టిన కాగితాలు అని అంటున్నారు!
వివరాళ్లోకి వెళ్తే… జనసేన అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారంలో హార్డ్ కోర్ పార్టీ నేతలకు అన్యాయం జరిగిందని.. చంద్రబాబు పంపిన నేతలకు, వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలకే కీలకమైన టిక్కెట్లు దక్కాయని విమర్శలు వినిపిస్తున్నాయి! ఈ నేపథ్యంలో… ఉన్న 21 స్థానాల్లోనూ వీర మహిళలు అని చెప్పే జనసేన మహిళా కార్యకర్తలకు ఒకే ఒక్క సీటు కేటాయించారు పవన్ కల్యాణ్. దీనిపై జనసేనలో సర్వత్రా విమర్శలు వచ్చాయని చెబుతున్నారు.
మహిళల హక్కులు, వారి స్వయం సమృద్ధి, మహిళా రిజర్వేషన్లు, చట్టసభల్లో మహిళల స్థానం, పాత్ర మొదలైన విషయాలపై ప్రసంగాలు దంచికొట్టే జనసేనాని… చేతల్లోకి వచ్చే సరికి సొంతపార్టీలోని మహిళలకే హ్యాడ్ ఇచ్చారని.. పవన్ చెప్పాడంటే చేయడంతే అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఈ సమయంలో… ముందుజాగ్రత్త చర్యగానో ఏమో కానీ… వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కల్యాణ్.
ఇప్పటికే పార్టీలో తమకు సముచిత స్థానం లేదని, టిక్కెట్ల కేటాయింపులో కరివేపాకులా చూశారని చాలా మంది నిప్పులు కక్కుతున్నారని తెలుస్తోన్న సమయంలో… వారందరినీ మంగళగిరి ఆఫీసులోని హాల్ లోకి పిలిపించారు పవన్ కల్యాణ్! ఈ సందర్భంగా… టిక్కెట్ ఆశించి బంగపడి, అవమానపడుతున్నట్లు చెప్పబడుతున్న కొంతమంది మహిళా నేతలతో భేటీ అయిన ఆయన… “నియామకపత్రాలు”ను వారి చేతుల్లో పెట్టి ఫోటోలు దిగారు.
ఈ సందర్భంగా… ప్రజా క్షేత్రంలో వీర మహిళలు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేమని.. అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత ఐదేళ్లుగా పార్టీ అభ్యూన్నతి కోసం వీర మహిళలు పడిన కష్టం, ఆ కష్టపడిన తీరు గొప్పదని పవన్ మెచ్చుకుని.. అసెంబ్లీ టికెట్లు అడిగితే చేతిలో నియామకపత్రం పెట్టి పంపించేశారు! దీంతో… మరింత నిప్పులు కక్కుతున్నారని తెలుస్తుంది! ఈ పత్రంతో ఏమి చేసుకోవాలో కూడా చెబితే బాగుండేదని ఫైర్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి!
కాగా… ఇటీవల టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలకు జాతీయ ఉపాధ్యక్షుడు, జాతీయ ప్రచార కార్యదర్శి వంటి అనేక రకాల పదవులు ఇచ్చారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో పవన్ కూడా నియామకపత్రాలు అని ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేయడం చూస్తుంటే… మసిపూసి మారేడు కాయ చేసే విషయంలో పవన్.. గురువుని మించిన శిష్యుడు అని అంటున్నారు పరిశీలకులు.