రాప్తాడులో సునీతకు చంద్రబాబు షాక్

రానున్న ఎన్నికలకు సంబంధించి అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీతకు షాక్ తప్పేట్లు లేదు. తల్లి, కొడుకులు ఇద్దరు పోటీ చేయాలని సునీత, పరిటాల శ్రీరామ్ గట్టిగా పట్టుపడుతున్న విషయం తెలిసిందే. రాప్తాడులో తాను పోటీ చేస్తానని చెబుతున్న సునీత కొడుకు శ్రీరామ్ ను ధర్మవరం అసెంబ్లీ నుండి కానీ లేకపోతె హిందుపురం ఎంపిగా గానీ పోటీ చేయించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా ఒకవైపు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతూనే మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలో ఎంఎల్ఏ వరదాపురం సూర్య నారాయణరెడ్డిని గబ్బు పట్టిస్తున్నారు.  నియోజకవర్గంలో ప్రతీ పనిలోను శ్రీరామ్ వేలుపట్టి కంపు చేస్తున్నారు. దాంతో వరదాపురం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.

ఇటువంటి నేపధ్యంలో సునీతకు చంద్రబాబు పెద్ద షాకే ఇచ్చారట. కొడుకు సీటు విషయంలో ఈమధ్య చంద్రబాబుతో  సునీత భేటీ అయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు సునీతకు షాక్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీరామ్ పై ఉన్న వివాదాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది. అదే సమయంలో తల్లీ, కొడుకులకు ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పేశారట. ఇద్దరిలో ఎవరు పోటీ చేయాలో తేల్చుకోమని సునీతకే చాయిస్ వదిలేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. అందులోను హిందుపురం ఎంపి సీటులో కమ్మ సామాజికవర్గానికి సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారట. అదే సందర్భంలో వరదాపురి సూరి విషయంలో చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. కాబట్టి సూరిని పక్కకు తప్పించే అవకాశం లేదని తేలిపోయింది.  అంతేకాకుండా ధర్మవరం నియోజకవర్గంలో వేటు పెట్టొద్దని గట్టిగా హెచ్చరించారని సమాచారం.

చంద్రబాబు చెప్పిన వివరాలను బట్టి ఏమర్ధమవుతోంది ? సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులోనే తల్లీ, కొడుకుల్లో ఎవరు పోటీ చేయాలో తేల్చుకోమని చెప్పినట్లైంది. సునీతేమో పెనుకొండ సీటులో అయినా పోటీకి అవకాశం ఇవ్వమని అడిగారు. అయితే, అక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్ధసారధి బిసి సామాజికవర్గానికి చెందిన  నేత. కాబట్టి బిసి నేతను డిస్ట్రబ్ చేయలేరు. అందుకనే రాప్తాడులో ఎవరు పోటీ చేయాలో నిర్ణయించుకునే అవకాశం సునీత, శ్రీరామ్ లే తేల్చుకోవాలి.  వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేసే విషయంలో మాంచి దూకుడు మీదున్నారు. కొడుకును ఆపేంత శక్తి సునీతకు లేదు. కాబట్టి సునీత ఇంటికే పరిమతమై శ్రీరామ్ పోటీలో ఉంటారని తేలిపోయింది.

జిల్లాలోని 14 సీట్లలో నాలుగుచోట్ల కమ్మ సామాజికవర్గానికి చెందిన  పరిటాల సునీత, హనుమంతరాయ చౌదరి, ప్రభాకర చౌదరి, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంఖ్యాపరంగా తక్కువే అయినా డామినేషన్ మాత్రం మొత్తం వారిదే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కమ్మ డామినేషన్ తగ్గించి బిసి, కాపులకు ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారని సమాచారం. అందుకనే పరిటాల కుటుంబం విషయంలో చంద్రబాబు అంత గట్టిగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమేమి మార్పులు జరుగుతాయో చూడాల్సిందే.