ప్రత్యర్థులపై పరిటాల శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్

అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు, యువనేత పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుధవారం రాప్తాడులో జయహో బీసీ సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీకి సంబంధించిన పలువురు నేతలు, బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన పరిటాల శ్రీరామ్ బీసీలను ఆకట్టుకునేలా మాట్లాడారు. కాగా ఈ సభలో ప్రత్యర్థులపై ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పరిటాల శ్రీరామ్ ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

బడుగులు బలహీనులు కాదు, ఎంతో శక్తివంతులు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటూ బలహీనవర్గాలను ఉద్దేశించి అన్నారు. మమ్మల్ని మీరు ఏనాడో మీలో కలుపుకుని ఆదరించారు కాబట్టే మా కుటుంబం ఈ స్థాయికి ఎదిగింది. పెత్తందారులు బడుగులు అణగదొక్కారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మా నాన్న రవీంద్రను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారి ఆటలు సాగవని నిరూపించారు. ఆయన ఉంటే వారి ఆటలు సాగవని కుట్రపన్ని నాన్నను చంపేశారు అంటూ మండిపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఆ పెత్తందారుల వారసులు గ్రామాల్లో చలామణి చేస్తున్నారు. కులాల మధ్య చిచ్చు రేపాలని ప్రయత్నిస్తున్నారు.

“పరిటాల కుటుంబాన్ని ఓడిస్తాం, అడ్డొచ్చినోళ్ళను తెగేసి నరుకుతాం…” అంటూ బెదిరిస్తున్నారని పరిటాల శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకు మమ్మల్ని ఓడిస్తారు? ఎందుకు ఎగరేసి నరుకుతారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలకు, పార్టీలకు అతీతంగా పని చేసినందుకా? పధకాలు అందించినందుకా? గ్రామాల్లో అభివృద్ధి చేసినందుకా? అని ప్రశ్నించారు. మా తాతలకాలం నుండి ప్రజల కోసం పని చేశాం. ఈ విషయాన్ని నేను ధైర్యంగా, గర్వంగా చెబుతున్నా. బెదిరింపులకు పాల్పడుతున్నవారు వారి వంశాల గురించి ధైర్యంగా మాట్లాడగలరా అంటూ నిలదీశారు.

మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ…

బడుగువర్గాలు తమ కుటుంబాన్ని తమలో కలుపుకుని ఆదరించాయన్నారు. వారికి తమ కుటుంబాన్ని అంకితం చేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పరిటాల రవీంద్రతోపాటు, తగరకుంట ప్రభాకర్, పావురాల కిష్టలాంటి అనేకమందిని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. ఆ సమయంలో తమ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించిందని, పిల్లల్ని పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

అయినా ప్రజల కోసం తమ కుటుంబం పోరాడుతూనే ఉందని, నాతోపాటు నా కుటుంబం మొత్తం ప్రజలకే అంకితమని తెలియజేసారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు టీడీపీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు కుటుంబాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ…వారు మాత్రం వారి ఇళ్లల్లో ఆనందంగా గడుపుతున్నారని దుయ్యబట్టారు.