తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో అక్రమాలు (వీడియో)

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని నిరుద్యోగ అభ్యర్ధి ఆరోపించారు. ఓయూ, సెంట్రల్ లైబ్రరీలో ఉండి అహర్నిషలు చదువుకున్న ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోవడం అనుమానంగా ఉందన్నారు. టిఆర్ఎస్ కండువా వేసుకొని తిరిగిన వారికి ఉద్యోగాలు వచ్చాయని వారు ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకంలో చాలా అవకతవకలు ఉన్నాయని పైరవీల ద్వారా పోస్టుల నియామకం చేసినట్టు స్పష్టమవుతుందన్నారు.  నిరుద్యోగులు అంతా వాట్సాప్, ఫేస్ బుక్ లలో సపోర్టు ఇవ్వడం కాదు ప్రత్యక్షంగా వచ్చి ఉద్యమం చేయాలని ఓ నిరుద్యోగ అభ్యర్ధి పిలుపునిచ్చారు. సచివాలయ ముట్టడికి రావాలన్నారు.

నియామకాలలో అక్రమాలు జరిగాయని చిక్కడపల్లిలోని నగర గ్రంథాలయం నుంచి హిమాయత్‌నగర్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వరకు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తుది కీ విడుదల చేయకుండా.. మెరిట్‌జాబితాను ప్రకటించకుండా ఉద్యోగాలు భర్తీచేయడంపై అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేశారు.

ఇష్టం ఉన్నట్టుగా మెరిట్ లిస్ట్ ప్రకటించారని ఏదో ఓ నెంబర్ వేసి చేస్తే చేసేదేముందని వారు ప్రశ్నించారు. ఖచ్చితంగా రాజకీయంగా అనుకూలంగా ఉన్నవారికే ఉద్యోగాలు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలకు ఫిర్యాదు చేశామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు నియామక ప్రక్రియను నిలిపివేయకపోతే హైకోర్టుకు వెళతామని వారు హెచ్చరించారు. 

కొన్ని జిల్లాల్లో  ఒక్కో అభ్యర్థి హాల్‌టికెట్‌ నెంబర్‌ మూడుసార్లు వచ్చిందని ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ తీసుకెళ్లారు. దీంతో సచివాలయానికి రావాలని సీఎస్‌ సూచించగా ఆమె తన కార్యాలయం నుంచి హూటాహుటిన సచివాలయానికి  వెళ్లారు. సీఎస్ ఎస్ కే జోషి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి మధ్య ఏం చర్చ జరిగిందనేది తెలియాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో మెరిట్ లిస్ట్ ప్రకటించగా మరికొన్ని జిల్లాలో అసలు లిస్టే పెట్టలేదు. అంతా గందరగోళంగా ఉందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తమ జీవితాలు ఆగం చేస్తారా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియ వెంటనే నిలిపివేసి ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో వచ్చిన లిస్ట్ లో పేర్లలో మిస్ మ్యాచింగ్ ఉందని కలెక్టర్ స్వయంగా చెప్పారని నిరుద్యోగి తెలిపారు. మిస్ మ్యాచ్ రావడంతో నల్లగొండలో అసలు ఫలితాలే విడుదల చేయకుండా నిలిపి వేశారు. 

ఓ నిరుద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో కింద ఉంది చూడండి.