ఉగ్రవాదులున్నారని చెప్పడం వెనుక అసలు ఉద్దేశ్యం ?

ఉగ్రవాదులున్నారని చెప్పడం వెనుక అసలు ఉద్దేశ్యం ?

పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులున్నారట . ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించడం ఆశ్ఛర్యంగా వుంది . అది కూడా అమెరికా పర్యటనలో ఉండగా ఇమ్రాన్ ప్రకటించడం ఇప్పుడు సంచలనం వార్తగా మారింది . పాకిస్తాన్ లో ఉగ్రమూకలున్నాయని ప్రపంచానికి తెలుసు . కానీ పాకిస్తాన్ మాత్రం మా దేశంలో ఉగ్రవాదులు లేరు , ఉగ్ర స్థావరాలు అసలే లేవు అంటూ ఇంత కాలం బుకాయిస్తూ వస్తుంది . పాకిస్తాన్ ఉగ్రవాదంతో భారత దేశం ఎన్నో రకాలుగా నష్టపోతోంది . ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది . మన దేశానికి ఈ ఉగ్రవాదం పెను సవాలుగా మారిపోయింది .

అమెరికా పర్యటనలో వున్నా ఇమ్రాన్ ఖాన్ యునైటెడ్ స్టేట్స్ పీస్ ఇనిస్టిట్యూట్ లో ప్రసంగిస్తూ ఈ మాటలు చెప్పారు . ఇమ్రాన్ అలా ఉగ్రవాదం గురించి మాట్లాడతారని , అదికూడా తమ దేశంలో 40 వరకు వివిధ ఉగ్రవాద సంస్థలున్నాయని , సుమారు 40 వేలమంది కి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులున్నారని పేర్కొన్నాడు . తాను అధికారంలోకి వచ్చిన తరువాత చాలావరకు ఉగ్రవాదులలోని అనేకరకాలైన చర్యలు చేపట్టామని , తమ దేశంలో వున్న అన్ని పార్టీల సహకారంతో వాటిని నియంత్రిస్తున్నామని చెప్పారు . ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఆఫ్గనిస్తాన్ , కాశ్మీర్ లో ఇస్తున్నారని చెప్పాడు . అయితే గత ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టక పోవడం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని చెప్పాడు . అయితే తమ ప్రభుత్వం మాత్రం ఉగ్రవాదం తమ గడ్డపై ఉండకూడదని అనేక చర్యలు చేపట్టినట్టు ఇమ్రాన్ స్పష్టం చేశాడు .

అయితే ఇంతకాలం భారత దేశంతో పాటు అమెరికా కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని , లేకపోతే ఆర్ధిక సహకారాన్ని నిలిపి వేస్తామని కూడా పుల్వామా ఘటన తరువాత హెచ్చరించింది . భారత దేశం పాకిస్తాపై అకస్మాత్తుగా దాడి జరిపి జైషే మహ్మమద్ స్థావరాలను నాశనం చేసింది . అయినా భారత దేశం అలాంటి చర్య ఏమీ చెయ్యలేదని ఇమ్రాన్ అప్పట్లో చెప్పాడు .

మరి ఇప్పుడు హఠాత్తుగా అమెరికాలో అదీ శాంతి సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇలా ఎందుకు చెప్పాడు . పాకిస్తాన్ ను అప్పుల కూపం నుంచి అమెరికా సహాయంతో బయట పడేయాలని పన్నాగమా ? ఈ ప్రకటనను పాకిస్తాన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది .