“హతఃవిధీ… పరిస్థితులు ఏమిటి మరీ ఇలా పగబట్టేశాయి.. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ.. ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి.. ఒకపక్క స్కిల్ స్కాం, మరోపక్క ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, ఇంకో పక్క అంగళ్లు అల్లర్ల కేసు.. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఓటుకు నోటు కేసు.. కాలం ఎదురు తన్నడం అంటే ఇదేనేమో”.. ప్రస్తుతం తెలుగుదేశం శ్రేణుల మదిలో మెదులుతున్న ప్రశ్నలివేనేమో!
అదేంటి… పైన చెప్పుకున్న అన్నీ కేసులో ఆయా కోర్టుల్లో విచారణ దశల్లో ఉన్నవి. మూడో తేదీన సుప్రీంలో స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్.. ఆ తర్వాత రోజు మిగిలిన కేసుల్లోని ముందస్తు బెయిల్ పిటిషన్స్ విచారణకు ఉన్నాయని తెలుసు కానీ… ఎప్పుడో మరుగున పడింది అనుకుంటున్న ఓటుకు నోటు కేసు మరళా తెరపైకి వచ్చిందా? అంటే అవుననే అంటోంది సుప్రీంకోర్టు సమాచారం!
అవును… తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఈ నెల 4న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో వెలుగులోకి రావడంతోపాటు… “మావాళ్లు బ్రీఫ్డ్ మీ” అనే వాయిస్ కూడా లీక్ అవ్వడంతో అప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అయితే ఈ కేసును అప్పట్లో సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించిన తెలంగాణ సర్కార్… బాబు హైదరాబాద్ విడిచి కరకట్టకు వచ్చేసిన అనంతరం లైట్ తీసుకున్నట్లు కామెంట్లు వినిపించాయి. అయితే మంగళగిరి ఎమెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో రెండు పిటిషన్ దాఖలు చేశారు.
అందులో ఒకటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కాగా… ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను 4వ తేదీన విచారణ చేపట్టనున్న జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం తెలిపిందని తెలుస్తుంది! కాగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ నెల 3న విచారణ జరగనున్న సంగతి తెలిసిందే!