వైసీపీకి మరో ఆప్షన్ లేదు, బీజేపీకి మద్దతివ్వడమే.!

కేంద్రం మెడలు వంచేది లేదు.. బీజేపీని అసలే నిలదీసేది లేదు. మిగిలిన రెండేళ్ళ పాలన కూడా సజావుగా సాగిపోవాలంటే, బీజేపీని ప్రసన్నం చేసుకోవడమొక్కటే మార్గం. ఎందుకిలా.? ఏమో, వైసీపీ అధిష్టానానికే తెలియాలి. ప్రత్యేక హోదా సహా ఏ విషయంలోనూ కేంద్రాన్ని నిలదీసే ధైర్యంగానీ, బీజేపీని ప్రశ్నించే ధైర్యంగానీ తమకు లేవని వైసీపీ తన చేతల ద్వారా ఇప్పటికే నిరూపించింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసింది ఈ విషయంలో.

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడుతున్న ద్రౌపది మర్ముని కలిశారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు మీరు గొప్ప ప్రెసిడెంట్ అవుతారు..’ అంటూ ఆమెను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పేశారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్నారు కూడా.

సో, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అవసరాన్ని బీజేపీకి గుర్తు చేస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై వైసీపీ డిమాండ్ చేస్తుందనే అంశానికి ఇప్పుడు అవకాశమే లేకుండా పోయిందన్నమాట. వైసీపీ నుంచి బీజేపీకి పూర్తి మద్దతు లభిస్తుంది గనుక, రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది మర్ము గెలవడం అనేది లాంఛనమే.

ఈ ఒక్క సందర్భాన్ని అయినా అనుకూలంగా మలచుకుని, కేంద్రం ముందు రాష్ట్ర సమస్యల చిట్టా పెట్టి, వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘డిమాండ్’ చేసి వుంటే, రాష్ట్రానికి కాస్తో కూస్తో ప్రయోజనం కలిగి వుండేదేమో.!

వైసీపీ – బీజేపీ మధ్య ఈ స్థాయి అవగాహన, మిత్రపక్షాలైన బీజేపీ – జనసేన మీద కూడా లేకపోవడం ఆశ్చర్యకరమే. ఒకప్పుడు టీడీపీ – బీజేపీ కలిసి వున్నా, అప్పట్లోనూ ఆ రెండు పార్టీల మధ్యా ఇంతటి సఖ్యత లేకపోవడం విశేషం కాక మరేమిటి.?