డ్యామిట్.! మళ్ళీ ‘క్వాష్’ కథ అడ్డం తిరిగింది.!

ఏదో అనుకుంటోంటే, ఇంకోటేదో అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే కనిపించడంలేదు. ఏ కోర్టుకు వెళ్ళినా దాదాపుగా ఒకటే సమాధానం ఎదురవుతోంది. ఆ సమాధానం అస్సలు మింగుడపడనిదిగా వుంటోంది చంద్రబాబుకి.

సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబుకి అక్కడా చుక్కెదురయ్యింది. అక్టోబర్ మొదటి వారానికి కేసు విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్ధ లూద్రా, సీజేఐని ఎంతలా కోరినా, సానుకూల ఫలితం అయితే రాలేదు.

మెన్షన్ దగ్గర్నుంచి, విచారణ దాకా.. అన్నీ, చంద్రబాబుకి చేదు అనుభవాల్నే మిగిల్చాయి. సుప్రీంకోర్టుకి వరుస సెలవుల నేపథ్యంలో అర్జంటుగా కేసు విచారణ చేయాలని లూద్రా పట్టుబట్టడంతో, విచారణ షురూ అయ్యిందిగానీ, ‘క్వాష్’ దిశగా సుప్రీంకోర్టు ఎలాంటి సానుకూల నిర్ణయమూ వెల్లడించలేదు.

బెయిల్ కోసం ఎందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ప్రయత్నించడంలేదన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. ‘బెయిల్ కాదు మేం కోరుకుంటున్నది.. మాక్కావాల్సింది క్వాష్’ అంటోంది చంద్రబాబు తరఫు న్యాయవాదుల బృందం. మరోపక్క, ఇతర కేసుల్లో మాత్రం ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ఆ వ్యవహారాలు కూడా ముందుకు కదలడంలేదాయె.! వ్యవస్థల్ని మేనేజ్ చేయగల దిట్టగా పేరున్న చంద్రబాబుకి ఈ దుస్థితి ఏంటో మరి.!