స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి ఊరట దక్కడంలేదు సరికదా, మరిన్ని కేసులు క్యూ లైన్లో వేచి చూస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి కోసం. తాజాగా, ఫైబర్ నెట్ పేరుతో 121 కోట్ల మేర అవినీతి జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు 2021లోనే 18 మందిపై కేసు నమోదయ్యింది.
ఈ కేసులో ఏ1 నిందితుడిగా వేమూరి హరి ప్రసాద్, ఏ2 నిందితుడిగా మాజీ ఎండీ సాంబశివరావు తదితరుల పేర్లను ఏపీ సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా, చంద్రబాబు పేరుని ఏ1 నిందితుడిగా చేర్చి, వారెంట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఏసీబీ కోర్టు స్వీకరించింది.
గతంలోనే, చంద్రబాబుని ఈ కేసులో అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. చంద్రబాబుతోపాటు లోకేష్ కూడా అరెస్టవుతారంటూ ఫైబర్ నెట్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి వైసీపీ నేతలు చాలా ధీమాగా ప్రకటించేశారు. ఏళ్ళు గడుస్తున్నా, చంద్రబాబు వరకూ ఈ కేసు విషయమై సీఐడీ రాలేదు.
సరిగ్గా, ఎన్నికల ముందర బ్యాక్ టు బ్యాక్.. కేసులతో చంద్రబాబుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. రాజధాని అమరావతికి సంబంధించిన పలు కేసుల్లోనూ చంద్రబాబుని నిందితుడిగా చూపేందుకు ఏపీ సీఐడీ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఓ కేసులో చంద్రబాబుకి ఊరట దక్కినా, ఇంకో కేసులో ఆయన ఇరుక్కుపోవడం ఖాయమనే విషయం టీడీపీ శ్రేణులకూ అర్థమవుతోంది. మరోపక్క, జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు చంద్రబాబు, జైలు నుంచే తన కుమారుడు లోకేష్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
లోకేష్ కూడా అరెస్టవుతారని వైసీపీ చెబుతుండడం చూస్తోంటే, రేపో మాపో ఆ ముచ్చటా తీరిపోవచ్చు. ఈ వరుస కేసుల వ్యవహారం చూస్తోంటే, అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి చంద్రబాబుకి అర్హత వుంటుందా.? లేదా.? అన్న డౌటానుమానాలు కలుగుతున్నాయి టీడీపీ శ్రేణులకి.